Share News

జెడ్పీ కన్వెన్షన్‌ రచ్చ!

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:41 AM

ప్రజాధనంతో నిర్మించిన జెడ్పీ కన్వెన్షన్‌హాలు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అద్దె రూపంలో వచ్చే ఆదాయం జెడ్పీకి సక్రమంగా జమ చేయాల్సి ఉన్నా అధికశాతం నగదు పక్కదారి పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జెడ్పీ కన్వెన్షన్‌హాలు సీలింగ్‌కు చెదలు పట్టిందని లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేయాలనే ప్రతిపాదన పెట్టారు. మరమ్మతులు పూర్తయ్యేవరకు ఈ హాలును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 జెడ్పీ కన్వెన్షన్‌ రచ్చ!

- ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నిర్వహణ

- అద్దెల వ్యవహారంలో అనేక అక్రమాలు!

- అడ్డుకునేందుకు కూటమి ప్రజాప్రతినిధుల ప్రయత్నం

- తాజాగా మరమ్మతుల పేరుతో మూసివేత

- నిధుల విడుదలకు అధికారుల విముఖత

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ప్రజాధనంతో నిర్మించిన జెడ్పీ కన్వెన్షన్‌హాలు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అద్దె రూపంలో వచ్చే ఆదాయం జెడ్పీకి సక్రమంగా జమ చేయాల్సి ఉన్నా అధికశాతం నగదు పక్కదారి పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జెడ్పీ కన్వెన్షన్‌హాలు సీలింగ్‌కు చెదలు పట్టిందని లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేయాలనే ప్రతిపాదన పెట్టారు. మరమ్మతులు పూర్తయ్యేవరకు ఈ హాలును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రజాప్రతినిధి మనుషులతోనే నిర్వహణ

2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ సూచనలతో జెడ్పీ కన్వెన్షన్‌ హాలును ఆధునిక హంగులతో జెడ్పీ ప్రాంగణంతో నిర్మించారు. జెడ్పీ, మండల పరిషత, పంచాయతీలకు వచ్చిన నిధులు సకాలంలో పనులు చేయని కారణంగా వెనక్కి వెళ్లిపోయేస్థితిలో ఆ నిధులను దీనికి మళ్లించారు. 2024, మేలో ఈ కన్వెన్షన్‌ హాలును ప్రారంభించే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ హాలును వైసీపీ నాయకులు గలాటా సృష్టించి, ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పగలకొట్టి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తమ మనుషుల ద్వారా నడుపుతూ వచ్చారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో కొంతకాలం తర్వాత జెడ్పీలోని సిబ్బందికి ఈ కన్వెన్షన్‌హాలు నిర్వహణను అప్పగించారు. ఆ తర్వాత జెడ్పీ కన్వెన్షన్‌హాలు నుంచి ఆదాయం రాకపోవడంతో సంబంధిత ఉద్యోగులను ఈ బాధ్యతల నుంచి తప్పించారు. జెడ్పీలో ప్రజాప్రతినిధి తరఫున కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ కన్వెన్షన్‌హాలు నిర్వహణ బాధ్యతలను గుట్టుచప్పుడు కాకుండా అప్పగించారు. గతంలో ఈ హాలులో ఏసీలు బిగించినట్లుగా చూపి పెద్ద మొత్తంలో బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధి మనుషులే ఈ కన్వెన్షన్‌హాలు నిర్వహణ పనులు చూస్తుండటంతో ఈ హాలును అద్దెకు ఇచ్చిన సమయంలో ఖర్చుల పేరుతో తప్పుడు లెక్కలు రాసి మాయ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ కన్వెన్షన్‌ హాలులో శుభకార్యాలు జరిగే సమయంలో లైటింగ్‌, డెకరేషన్‌, కేటరింగ్‌ తదితరాల పేరుతో పెద్దమొత్తంలో ధరలు నిర్ణయించి నిర్వాహకులు ముక్కుపిండి మరీ అధిక మొత్తంలో అనధికారికంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా మరమ్మతుల ప్రతిపాదన

జెడ్పీ కన్వెన్షన్‌ హాలులోని సీలింగ్‌కు చెదలు పట్టిందని, కొంత మేర సీలింగ్‌ పడిపోయిందని చూపి ఇటీవల కొంత భాగానికి మరమ్మతులు చేశారు. అంతటితో ఆగకుండా నిన్నటి మొంథా తుఫాను ప్రభావంతో సీలింగ్‌ పడి పోవడానికి సిద్ధంగా ఉందని, చెదలు మరింతగా పెరిగిందనే కారణం చూపి ఈ కన్వెన్షన్‌ హాలును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీ రాజ్‌ ఈఈ ద్వారా సీలింగ్‌ను ఏర్పాటు చేయాలని లక్షలాది రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు జెడ్పీ సీఈవోకు పంపారు. గతంలో జెడ్పీ ప్రాంగణంలోని గెస్ట్‌ హౌస్‌ మరమ్మతుల పేరుతో నామినేషన్‌ పద్ధతిన పనులు చేయించారు. అదికూడా జెడ్పీలో కీలక ప్రజాప్రతినిధి అనుచరుల పేరుతోనే పనులు కేటాయించారు. రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైగా బిల్లులు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ అంశం అప్పట్లో వివాదాస్పదమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ కన్వెన్షన్‌హాలు మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసే అంశంపై జెడ్పీ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ సదస్సులు, సమావేశాలు ఇక్కడే..

ప్రభుత్వం ఉద్యోగులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు జెడ్పీ కన్వెన్షన్‌ హాలులో తరచూ నిర్వహిస్తున్నారు. ఇలా ఉపయోగ పడుతున్న హాలును సీలింగ్‌కు చెదలు పట్టిందని, కూలిపోతే ప్రమాదాలు జరుగుతాయనే కారణాలు చూసి మూసివేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్పీలో పాలకవర్గం వైసీపీకి చెందిన వారు ఉండగా, జిల్లాలో కూటమికి చెందిన శాసన సభ్యులు ఉన్నారు. జెడ్పీ కన్వెన్షన్‌ హాలును వైసీపీ నాయకుల చెర నుంచి విడిపించేందుకు కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మూసి వేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జెడ్పీ కన్వెన్షన్‌ హాలుకు మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఇంకా పనులు చేసేందుకు అనుమతులు రాలేదని, మరమ్మతలు చేసే వరకు ఈ హాలును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:41 AM