CM Chandrababu: రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:27 AM
రాష్ట్రంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదు. హద్దుమీరి శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని రాష్ట్ర బహిష్కరణ చేయండి.
రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు
పోలీసులంటే క్రిమినల్స్‌కు భయం ఉండాలి
నెల్లూరులో లేడీ డాన్ల దౌర్జన్యాలా?
ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే
పావుగంటలో బాధితుల వద్దకు పోలీసులు చేరాలి
అసంబద్ధ చలాన్లతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండండి
పోలీసు అధికారులకు సీఎం దిశా నిర్దేశం
నేరస్థుల పట్ల నిర్లిప్తత కూడదు: పవన్
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదు. హద్దుమీరి శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని రాష్ట్ర బహిష్కరణ చేయండి. నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టు నమోదు చేసి అణచివేయండి. పోలీసులంటే నేరగాళ్లకు భయం ఉండాలి. తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టినప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. శాంతిభద్రతలపై కూటమి ప్రభుత్వానికి జీరో టాలరెన్స్’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు గురువారం శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. జిల్లాల ఎస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదన్నారు. సంఘవిద్రోహ శక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొఫెషనల్ క్రిమినల్స్ లొంగకపోతే రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. నెల్లూరు లాంటి జిల్లాల్లో లేడీ డాన్స్ దౌర్జన్యాలేంటి.? గంజాయి వ్యాపారానికి అడ్డొస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిందేనని గట్టిగా చెప్పారు. మ్రహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గడం శుభపరిణామమన్న సీఎం, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టే శక్తులపై నిఘా పటిష్ఠం చేయాలని చెప్పారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందిస్తూ.. జిల్లాకొక సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఫైలు ప్రభుత్వం వద్ద ఆగిందని గుర్తు చేశారు. దీనికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తీర ప్రాంత భద్రతకు బోట్లు, డ్రోన్లు అవసరమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం నిధులు తక్షణమే మంజూరు చేశారు. నేరాలను అరికట్టడంతో పాటు సొమ్ము రికవరీ చేయడంలో ఎన్టీఆర్ కమిషనరేట్ అగ్రస్థానంలో ఉండటంపై సీఎం అభినందనలు తెలిపారు. కడప జిల్లాలో నేరాల రేటు 44శాతం పెరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత సొంత జిల్లా అనకాపల్లిలోనే మహిళలపై నేరాలు ఎక్కువ జరగడం పట్ల సీఎం పెదవి విరిచారు. ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్న సందేశం బలంగా వెళితేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు.
శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి: పవన్
‘విశాఖపట్నంలో ఇటీవల కొందరు ఆకస్మికంగా దాడి చేస్తే బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రాజకీయ నేతలు దాని వెనుక ఉండటంతోనే పోలీసులు అలా ప్రవర్తించారన్న ప్రచారం బలంగా జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఎలా.? నేరస్తుల పట్ల నిర్లిప్తత వద్దు’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసు అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యల్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు సూచించారు.
ఏపీ పోలీస్ సేవ స్థానంలో ‘సురక్ష’ యాప్
రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ‘సురక్ష’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ఈసాక్ష్య యాప్ ద్వారా సాక్ష్యాలను రికార్డు చేసి వాటిని ఐసీజేఎస్‌తో అనుసంధానించి కోర్టుల్లో శిక్షల శాతం పెంచేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు.