TTD former chairman YY Subbareddy: ఇలా వచ్చి.. అలా వెళ్లి..
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:09 AM
పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఈ కేసులో ఇతర నిందితులను సుదీర్ఘంగా విచారించగా....
పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి
విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఈ కేసులో ఇతర నిందితులను సుదీర్ఘంగా విచారించగా, వైవీ విచారణ మాత్రం కేవలం రెండు గంటల్లోనే ముగిసింది. ఇదేదో చుట్టం చూపుగా వచ్చినట్లు ఉందంటూ సుబ్బారెడ్డి విచారణపై పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. విజయవాడకు సమీపాన ఉన్న కానూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఆయనను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ విచారించారు. రెండు గంటలపాటు సాగిన విచారణలో సుబ్బారెడ్డికి సుమారు 20 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణ తర్వాత బయటకు వచ్చిన సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకామణి నెపాన్ని టీటీడీ అధికారుల మీదకు నెట్టేందుకు ప్రయత్నించారు. డాలర్ల చోరీ తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగినప్పటికీ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు బయట పడిందని, ఈ విషయాన్ని ఇన్నాళ్లూ ఎవరు దాచి పెట్టారో తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, సుబ్బారెడ్డిని కలిసేందుకు వైసీపీ నేతలు సీఐడీ కార్యాలయం వద్దకు క్యూ కట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు వచ్చారు. విచారణ పూర్తయ్యేంత వరకు సీఐడీ కార్యాలయానికి సమీప భవనంలోనే కూర్చున్నారు. పెనమలూరు పోలీసులు విచారణ కార్యాలయం ఉన్న వీధికి రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డి కార్యాలయంలో నుంచి బయటకు రాగానే వాటిని తోసుకుంటూ నాయకులు, కార్యకర్తలు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు.