Y V Subba Reddy: లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:30 AM
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు...
అప్పన్న గతంలో పీఏగా చేశారు.. తర్వాత నాతో లేరు
‘పరకామణి’ గురించి తెలియదు: వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ‘లై డిటెక్టర్’ పరీక్షకు సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత పదేళ్లలో నెయ్యి సరఫరాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశానని పేర్కొన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఆలయాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆలయ ప్రతిష్ఠను పెంచేలా పనిచేశానే తప్ప.. ఏనాడూ ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించలేదని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన తప్పు లేదు కాబట్టే.. సిట్ విచారణకు హాజరై నిజాలు చెప్పానని, చంద్రబాబు ఆరోపణలపై సుప్రీంకోర్టులో కేసు వేశానన్నారు. ఒకవైపు సిట్ దర్యాప్తు, మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే.. కల్తీ నెయ్యి పేరుతో మీడియాలో కథనాలు వస్తుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గత చంద్రబాబు పాలనలో నెయ్యి కొనుగోళ్లపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అప్పన్న గతంలో తనవద్ద పీఏగా పనిచేశారని, ఆ తర్వాత అతనితో సంబంధం లేదన్నారు. శుక్రవారం విజయవాడలో సీఐడీ విచారణకు హాజరవుతానని తెలిపారు.