TTD Fake Ghee Case: కల్తీలో కీలక పాత్రధారి వైవీ సుబ్బారెడ్డే
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:03 AM
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిదే! ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో కోట్లాది రూపాయలు...
ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు
టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనల్లో 2020లో ఆయన హయాంలోనే మార్పులు
అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు
పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన రెండు నిబంధనల తొలగింపు
డెయిరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు
ఎక్స్‌పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం
రంగంలోకి అనామక డెయిరీలు..
కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రం
ఈవో సింఘాల్ మౌనముద్ర
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిదే! ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి రాగా... 2020లో టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలను అడ్డగోలుగా మార్చిన విషయం తాజాగా బయటపడింది. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డే ఉన్నారు. బోర్డులో ఆయన చెప్పిందే ఫైనల్. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన సమీప బంధువు కావడంతో ఎవరూ ఎదురు చెప్పలేని పరిస్థితి. అస్మదీయ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఆయనే నిబంధనలు మార్పించారు. టెండర్లలో పాల్గొనే డెయిరీల అర్హతలను తగ్గించారు. కనీసం మూడేళ్లు డెయిరీ నిర్వహించి ఉండాలని పాత నిబంధన ఉండగా, దాన్ని ఏడాదికి తగ్గించారు. కనీసం ఏడాది పాటు డెయిరీ ప్రతి రోజు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించడంతో పాటు 8టన్నుల ఆవు పాలు ఫ్యాట్/నెయ్యి ప్రాసెస్ కెపాసిటీ కలిగి ఉండాలని పాత నిబంధనలు ఉండగా, ఈ రెండింటినీ (కండీషన్స్ 19, 20) పూర్తిగా తొలగించారు. డెయిరీ ఏడాది టర్నోవర్‌ను రూ.250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించేలా చేశారు. ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు కూడా ఈవోగా ఉన్నారు. నెయ్యి సరఫరా వ్యవహారంలో నిబంధనల మార్పు విషయంలో ఆయన మౌనముద్ర దాల్చారు. సిఫారసులకు ఆమోదం తెలిపారు. అంతిమంగా సుబ్బారెడ్డి మాటే నెగ్గింది. నిబంధనల సడలింపు ఫలితంగా ఊరూపేరూ లేని అనామక డెయిరీలు శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసి అపవిత్రం చేసేశాయి. మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే కల్తీ నెయ్యి దందా చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణలో నాటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
ఏళ్లుగా కఠిన నిబంధనలు
శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఆలయాలకు నిత్యాన్న ప్రసాదాలకు భారీగా నెయ్యి ఉపయోగిస్తారు. ఈ నెయ్యి సరఫరాకు డెయిరీలు ఎక్కువగా పోటీపడుతుంటాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం ఆషామాషీ విషయం కాదు. టీటీడీ పిలిచే టెండర్లల్లో పాల్గొనే డెయిరీలకు అనేక అర్హతలు ఉండాలి. కొన్నేళ్లుగా టీటీడీ కఠిన నిబంధనలను అమలు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకూ తిరుమలేశుని లడ్డూ ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు కొన్ని విధివిధానాలను నిర్దేశించారు. అనామక డెయిరీలు నెయ్యి సరఫరా చేస్తే ప్రసాదం నాణ్యత ఉండదన్న ఉద్దేశంతో బాగా పేరున్న పెద్ద డెయిరీలు టెండర్లు వేసేలా నిబంధనలు ఉండేవి. టీటీడీ పరిధిలోని ఆలయాలతో పాటు తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూలకు దేశీయ ఆవు నెయ్యినే వాడాలి. ఇందుకు అనుగుణంగా టెండర్ల నిబంధనలను పగడ్భందీగా రూపొందించారు.
వైవీ వచ్చాక...
2020లో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నెయ్యి సరఫరా ‘వ్యవహారం’ మొత్తం మారిపోయింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పు చేసేశారు. ముందుగా టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం ద్వారా ఒక టెక్నికల్ కమిటీని నియమించారు. దీనికి 28.12.2019లో బోర్డు అనుమతి తీసుకున్నారు. ఈ బోర్డు మీటింగ్‌లో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన టెండర్లలో మరిన్ని డెయిరీలు పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. టీటీడీ బోర్డు ఆమోదం మేరకు అప్పటి టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రొక్యూర్‌మెంట్ జీఎం, ఎస్‌వీజీఎస్ డైరెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ హెల్త్ ఆఫీసర్‌తో పాటు ఐఐఎం లక్నోకు చెందిన ప్రొఫెసర్ వెంకట్రమణయ్య, డెయిరీ ఎక్స్‌పర్ట్ ఎం.విజయభాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె.జయరాజారావును కమిటీలో నియమించారు. ఈ కమిటీ 23.01.2020లో తిరుమలలోని ప్రొక్యూర్‌మెంట్ జీఎం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. టెండర్ నిబంధనలను రివిజన్‌చేసి, పాత నిబంధనల్లో మార్పులు చేయాలని టీటీడీకి కొన్ని సిఫారసులు చేస్తూ నివేదిక సమర్పించింది. టీటీడీ జాతీయ స్థాయిలో పిలిచే టెండర్లకు కొన్ని నిబంధనలు, రాష్ట్ర, దక్షిణ భారత స్థాయిలో పిలిచే టెండర్లకు కొన్ని నిబంధనలు పాటిస్తుంది. ఈ మూడు విభాగాల్లో టెండర్ల నిబంధనల్లో ఉన్న కీలకమైన వాటిని ఎత్తేశారు. కీలకమైన షరతులు 19, 20ని తొలగించారు. సదరు కమిటీ సిఫారసుల ఆధారంగానే 2020 నుంచి టీటీడీ నెయ్యి టెండర్లు పిలవడం ప్రారంభించింది. ఇక్కడే కల్తీ నెయ్యి సరఫరాకు బీజం పడింది. అనామక, కనీస అర్హత లేని డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి.
ఏపీ డెయిరీలకూ మినహాయింపులు
ఏపీలో ఉన్న డెయిరీలకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన డెయిరీ అయినా ఫర్వాలేదని మార్చారు.
డెయిరీ రెండు లక్షల లీటర్ల పాలు సేకరణ చేయాలన్న నిబంధన తొలగించారు.
ఏపీలో ఉన్న డెయిరీ లేదా మ్యానుఫ్యాక్చరర్ టీటీడీ టెండర్లలో పాల్గొనాలంటే ప్రతి రోజు 3 టన్నుల ఆవు పాల ఫ్యాట్ కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులు సమర్పించాలి. ఈ నిబంధన కూడా తొలగించారు.
డెయిరీ ఏడాది టర్నోవర్‌ను రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు ఉండేలా మార్చారు. అలానే దక్షిణ భారతదేశంలో ఉన్న డెయిరీలకు సంబంధించి కండీషన్ 19, 20లను తొలగించారు. మిగిలిన కండీషన్లలో కీలక మార్పులు చేశారు.
2020 ఫిబ్రవరి 18న టీటీడీ పర్చేస్ కమిటీ సమావేశమైంది. ఎక్స్‌ఫర్ట్ కమిటీ చేసిన సిఫారసులను పర్చేస్ కమిటీ ఎలాంటి మార్పులు, లేకుండా ఆమోదించింది. ఇదే నెలలో టీటీడీ బోర్డు కూడా ఆమోదించింది.