CID: సీఎంపై అనుచిత పోస్టుల కేసులో..వైసీపీ కార్యకర్త శివప్రసాద్ అరెస్టు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:24 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ కూటమి నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త గడ్డం శివప్రసాద్‌ను...
ధర్మవరం నుంచి గుంటూరుకు తరలించిన సీఐడీ
ధర్మవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ కూటమి నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త గడ్డం శివప్రసాద్‌ను గుంటూరు సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురానికి చెందిన శివప్రసాద్... వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఉన్నాడు. ధర్మవరంలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబును, కూటమి నాయకులను గంగమ్మకు పొట్టేళ్లను నరికినట్లుగా నరికేస్తామని శివప్రసాద్ సోషల్ మీడియాలో ఈ నెల 6న పోస్టు పెట్టాడు. దీనిపై సీఐడీ బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 196, 353(2), 351(3), రెడ్ విత్ 79 కింద సుమోటోగా కేసు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన సీఐడీ ఇన్‌స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం శుక్రవారం రాత్రి ధర్మవరం వచ్చి శివప్రసాద్‌ను అరెస్టు చేసింది. ధర్మవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు ఈ సమాచారం అందించి.. అతడిని గుంటూరుకు తరలించింది.