Undavalli Arun Kumar: ఎన్‌డీఏ అభ్యర్థికి వైసీపీ ఓటా
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:42 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ నిర్ణయం అర్ధంకాకుండా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు
ఎన్‌డీఏ కూటమి చేతిలోనే ఆ పార్టీ ఓడిపోయింది
తెలుగువాడు, రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగినవాడు సుదర్శన్‌రెడ్డికి తెలుగు ఎంపీలంతా ఓటేయాలి
ఆర్‌ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తోంది: మాజీ ఎంపీ ఉండవల్లి
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ నిర్ణయం అర్ధంకాకుండా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఎన్‌డీఏకి చెందిన వ్యక్తికి ఎలా ఓటు వేస్తుంది? పైగా సుదర్శన్‌రెడ్డి తెలుగువాడు. సోషలిస్టు. రాజ్యాంగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నిలబెట్టగలరు. ఇంతకంటే అదృష్టం మీకేం ఉంటుంది? తెలుగు అభ్యర్థి పోటీ చేయడం వల్ల కూటమికి చెందిన తెలుగు ఎంపీలంతా ఓటేయవచ్చు. ఇక్కడ పార్టీలు అవసరం లేదు. సుదర్శన్‌రెడ్డి 2003లో ఇచ్చిన తీర్పును హోంమంత్రి అమిత్‌షా ఇవాళ వ్యతిరేకించి, ఆయనను నక్సలైట్‌గా చిత్రీకరించడం చాలా తప్పు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మొత్తం వ్యవస్థను చేతిలోకి తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందుకే నేరుగా ఆర్‌ఎస్ఎస్‌కు చెందిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టింది. రాజ్యాంగ నిపుణుడైన ధన్‌ఖడ్, మోదీతో విభేదించడం వల్లే ఆయనను రాజీనామా చేసేటట్టు చేశారు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సోషలిస్టులు ఉండకూడదనేదే ఆర్‌ఎ్‌సఎస్ సిద్ధాంతం. బీజేపీ దానిని అమలు చేస్తుంది. బీజేపీతో విభేదించే పార్టీలు ఇవాళ ఎన్‌డీఏకు ఓటు వేస్తే... వారిని చరిత్రలో ఎప్పటికీ ద్రోహులుగానే చూస్తారు’ అని ఉండవల్లి హెచ్చరించారు.