Share News

రప్పారప్పా అంటే కటకటాలే: హోంమంత్రి

ABN , Publish Date - Dec 28 , 2025 | 03:54 AM

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పుచోవడరంలో వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్‌ ఫ్లెక్సీకి మేకపోతును బలి ఇచ్చి..

రప్పారప్పా అంటే కటకటాలే: హోంమంత్రి

  • 2029లో జాతరే... అంటూ శివాలు

  • నాటు సారా తాగుతూ వీరంగం

  • ఏడుగురి అరెస్టు.. పరారీలో ఒకడు.

  • నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు

నల్లజర్ల, అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పుచోవడరంలో వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్‌ ఫ్లెక్సీకి మేకపోతును బలి ఇచ్చి.. నాటుసారా తాగుతూ,ఉన్మాదంతో చెలరేగిపోయారు. 2029లో గంగమ్మ జాతరే.. రప్పా రప్పా.. అంటూ రాసిన ఫ్లెక్సీ ఎదుట వీరంగం చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్డుపై నడిపించుకుని తీసుకెళ్లారు. వీళ్లంతా 25ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. తూర్పుచోడవరానికి చెందిన కత్తుల రమేశ్‌ శుక్రవారం రాత్రి 9గంటలకు గ్రామానికి చెందిన ఓ మాంసం వ్యాపారిని కలిశాడు. ‘మేక పోతును నరికి తిరిగిచ్చేస్తాం. అందుకు రూ.3వేలు ఇస్తాం’ అని చెప్పి మేకపోతును తీసుకున్నాడు. జగన్‌ జన్మదినం సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వద్దకు దానిని తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడకు అతని స్నేహితులు కొండాబత్తుల సాధు, పుట్టా నవీన్‌, ఉసుమర్తి పెదసాయి, ఆకాబత్తుల ఏసు, కనికెళ్ల రవి, తానింకి సమంజసరావు, దొడ్డిగర్ల రాజేశ్‌ చేరుకున్నారు. సాధు కత్తి తీసుకుని...‘జై జగన్‌’ అంటూ మేకపోతు తల నరికాడు. అందరూ కలిసి ఫ్లెక్సీపై రక్తం చిందించారు. ఉన్మాదంతో ఊగిపోతూ, రప్పా రప్పా.. అని అరుస్తూ, ఆ దృశ్యాలను వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌ అయింది. దీంతో నల్లజర్ల పోలీసులు అదే రోజు రాత్రి తూర్పుచోడవరం చేరుకుని, ఈ ఘటనకు కారణమైన 8మందిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. సమంజసరావు పరారీలో ఉన్నాడు. వారినుంచి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందరిపై ఆయుధాల చట్టంతోపాటు జంతువులను హించించిన ఆరోపణలపై మరికొన్ని సెక్షన్లను నమోదు చేశారు. అందరూ చూస్తుండగానే నిందితులను నల్లజర్ల పోలీస్ స్టేషన్‌ నుంచి సెంటర్‌ వరకు నడిరోడ్డుపై నడిపించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించి తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్‌ విధించగా, వారందరినీ సబ్‌ జైలుకు తరలించారు. గత ఎన్నికల సమయంలో రమేశ్‌, సాధు పై కేసులు నమోదయినట్టు పోలీసులు తెలిపారు.


కేక్‌ కటింగ్‌కు కత్తులు, తల్వార్లా?

వైసీపీపై హోంమంత్రి అనిత ఫైర్‌

పుట్టిన రోజు అంటే అన్నదానం చేయడం, రోగులకు పండ్లు పంచడం చేస్తామని, కానీ వైసీపీ నాయకులు మాత్రం రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేక్‌ కటింగ్‌కి వేటకొడవళ్లు, తల్వార్లు వాడటం ఒక్క వైసీపీ వారికే చెల్లిందన్నారు. ఇది సైకో తత్వానికి పరాకాష్ఠ అని ఆగ్రహించారు. ‘‘18 ఏళ్ల పిల్లలు కూడా కత్తులు పట్టుకుని రోడ్ల మీదకు రావడం బాధగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు గంజాయితో యువతను పాడు చేసిన జగన్‌, ఇప్పుడు తన పుట్టిన రోజు పేరుతో వారిని రౌడీలుగా తయారు చేస్తున్నారు.’’ అని తెలిపారు. అయితే, రప్పా రప్పా అని గీత దాటి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అలాంటి వారిని కటకటాల వెనక్కి పంపుతామని హెచ్చరించారు. కత్తులు, కటార్లతో రోడ్డుపైకి వస్తే ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 28 , 2025 | 03:55 AM