YCP Worker Arrest: రప్పా రప్పా.. వైసీపీ అభిమాని అరెస్టు
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:31 AM
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. మళ్లీ అధికారంలోకి వచ్చాక చంపేస్తాం, నరికేస్తాం, ఎవడైనా రానీ తొక్కిపడేస్తాం...
బారికేడ్లు తోసివేసిన అంబటిపై కేసు నమోదు
గోపిరెడ్డి, సత్తెనపల్లి పార్టీ ఇన్‌చార్జిపైనా..
సత్తెనపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. ‘మళ్లీ అధికారంలోకి వచ్చాక చంపేస్తాం, నరికేస్తాం’, ‘ఎవడైనా రానీ తొక్కిపడేస్తాం’, ‘2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేత తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం, నా కొడకల్లారా’, ‘వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు’, ‘అన్న వస్తాడు, అంతు చూస్తాడు’ అని వాటిలో హెచ్చరించారు, రప్పా రప్పా నరుకుతామని పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని వందనాదేవి సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్లకార్డు ప్రదర్శించింది క్రోసూరు మండలం 88-తాళ్లూరుకు చెందిన వైసీపీ కార్యకర్త రవితేజగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి నకరికల్లు పోలీసు స్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళి.. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద బారికేడ్లను తొలగించారు. వారించిన పోలీసులను అంబటి నెట్టివేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుల్ చిలకా గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేత సుధీర్ భార్గవ్‌రెడ్డి, తొర్లకుంట వెంకటేశ్వర్లు, మరికొందరు వైసీపీ కార్యకర్తలపైనా కేసు నమోదైంది.