YSRCP Student Leader: విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:26 AM
ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నారు.
విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా
ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న
వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి
విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం
గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు
చరణ్ దగ్గర 36 ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్ పట్టేసిన పోలీసులు
హైదరాబాద్, గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్టు వెల్లడి
జగన్, అమర్‌నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి సత్సంబంధాలు
నలుగురి అరెస్టు.. రిమాండ్, మరొకరి కోసం గాలింపు
విశాఖపట్నం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఐటీ రాజధానిగా విలసిల్లుతున్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ దిగుమతి, విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్ డ్రగ్స్‌ను నగరానికి చేరవేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా 36 ఎల్‌ఎ్‌సడీ బోల్ట్స్ లభ్యమయ్యాయి. కొండారెడ్డి కోసమే బెంగళూరు నుంచి తెస్తున్నట్టు చరణ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వాటిని నగరంలోని ఒక విద్యా సంస్థలో చదువుతున్న హర్షవర్ధన్‌నాయుడు, హైదరాబాద్‌కు చెందిన సంతానం, విశాఖకు చెందిన శరత్‌లకు విక్రయించేందుకు తెప్పించినట్టు అంగీకరించాడు. దీంతో ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు హర్షవర్ధన్‌నాయుడు, శరత్‌లను కూడా అదుపులోకి తీసుకుని 4వ పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. సంతానం కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖలోని మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిలకు కొండారెడ్డి సన్నిహితుడు. కొండారెడ్డి హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డగ్స్‌ను తెప్పించి నగరంతోపాటు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్‌ని డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్నట్టు భావిస్తున్నారు.