Signature Campaign: సంతకాల కోసం కోటి పాట్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:14 AM
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో వైద్యకళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఉసూరుమంటోంది.
పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబరు నుంచే కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ
గత నెల 27నే గవర్నర్‌ను కలుస్తామని అట్టహాసంగా జగన్ ప్రకటన
సంతకాలకు జనం ససేమిరా.. దీంతో హైదరాబాద్‌లో సేకరించేందుకు యత్నం
అక్కడా కుదరకపోవడంతో వెనుదిరిగిన నేతలు.. ఇక రాజ్‌భవన్‌కు వెళ్లేదెప్పుడో!
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో వైద్యకళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఉసూరుమంటోంది. 175 నియోజకవర్గాల్లోనూ అక్టోబరులో సంతకాల సేకరణ మొదలుపెట్టి.. నవంబరు 27న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అప్పట్లో అట్టహాసంగా ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో 57,500 మందితో సంతకాలు సేకరిస్తే తప్ప కోటి సంతకాలు పూర్తికావు. వైసీపీ శ్రేణులేవీ జనంలోకి వెళ్తున్న దాఖలాలే లేవు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్లి.. పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు అడిగితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నేతలు మౌనం దాలుస్తున్నారు. జగన్ విశాఖ రుషికొండపై ఆర్భాటంగా రూ.500 కోట్లతో నిర్మించిన ప్యాలెస్ వైసీపీకి గుదిబండగా మారింది. రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలను నిర్మించేయొచ్చని ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలను జనం ఇదే అడుగుతున్నారు. జగన్ తన ఒక్కరి కోసం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని.. ఆ నిధులను మెడికల్ కాలేజీలకు వాడితే తమకు మేలు జరిగేది కదా అని నిలదీస్తున్నారు. సగం సీట్లను యాజమాన్య కోటా కింద విక్రయించే అవకాశమివ్వడంపైనా అడుగుతున్నారు. దీంతో సంతకాల సేకరణ అంటేనే వైసీపీ నేతలు జంకుతున్నారు. సంతకాలు చేయడానికి జనం ముందుకు రాకపోవడంతో.. కొందరు వైసీపీ నేతలు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల నుంచి సేకరణకు సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నమూ బెడిసికొట్టడంతో వెనుదిరిగారు. కోటి సంతకాలు ఎప్పటికి పూర్తవుతాయి.. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఎప్పుడు సమర్పిస్తారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.