Share News

Kurnool Police: వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్‌ శ్యామలకు నోటీసులు

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:36 AM

కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్‌ ఆరే శ్యామలతోపాటు మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీచేశారు.

Kurnool Police: వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్‌ శ్యామలకు నోటీసులు

  • మరో ఇద్దరికీ.. కర్నూలు ప్రమాదంపై దుష్ప్రచారం

  • 27 మందిపై కేసు... దర్యాప్తునకు పోలీస్‌ బృందాలు

కర్నూలు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్‌ ఆరే శ్యామలతోపాటు మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీచేశారు. ‘బెల్టు షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగింది’ అంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు రూరల్‌ మండలం బి.తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఫిర్యాదు చేశారు. దీంతో 27 మందిపై కేసు నమోదైంది. కర్నూలు విచారణకు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ నాలుగు పోలీసు బృందాలను నియమించారు. కేసు నమోదైన వారి జాబితాలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపికృష్ణ తదితరులు ఉన్నారు. కేసు విచారణలో భాగంగా శనివారం ఓ పోలీసు బృందం హైదరాబాద్‌లోని గండిపేటలో యాంకర్‌ శ్యామల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాగార్జునరెడ్డి, ఒంగోలులో కిరణ్‌, విజయవాడకు చెందిన మరో ఇద్దరికి నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 మందికి నోటీసులు జారీచేసి, విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లోగా ఆరోపించినట్లు బెల్టు షాపులు ఎక్కడ ఉన్నాయి, యువకులు మద్యం ఎక్కడ తాగారు? అన్న విషయాలపై సమగ్ర సమాచారంతోపాటు ఆధారాలను సమర్పించాలని పోలీసులు కోరారు.

Updated Date - Nov 02 , 2025 | 05:38 AM