CID: వైసీపీ సోషల్ సైకోలపై కొరడా
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:07 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై సీఐడీ కన్నెర్రచేసింది.
సీఎం ‘యూరియా’ వ్యాఖ్యలపై మార్ఫింగ్ వీడియోలు
గుంటూరు, అనంతలో ఇద్దరి అరెస్టు.. నెల్లూరు వాసి పరార్
గుంటూరు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై సీఐడీ కన్నెర్రచేసింది. యూరియా వాడకానికి సంబంధించి చంద్రబాబు రైతుల పట్ల అనుచితంగా మాట్లాడినట్లుగా మార్ఫింగ్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నవారిపై మంగళగిరిలోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను నెల్లూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భరత్ సృష్టించాడు. వాటిని పాత గుంటూరు రెడ్ల బజారుకు చెందిన వజ్రాల తారక్ ప్రతాపరెడ్డికి, అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన బాలకొండ సాయి భార్గవ్ సహా మరికొందరికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంపి వైరల్ చేశాడు. దీనిపై సీఐడీ అధికారులు బీఎన్‌ఎస్ 196, 353, 111(3)(4)(5), 143 రెడ్ విత్ 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 666కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం సీఐడీ బృందాలు రంగంలోకి దిగడంతో ప్రధాన నిందితుడైన భరత్ పరారయ్యాడు. కేసులో ఏ-5 ప్రతాపరెడ్డి, ఏ-6 సాయి భార్గవ్‌లను సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గురువారం గుంటూరులోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రతాప్ రెడ్డికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఏ-6 సాయి భార్గవ్.. పోలీసులు తనను కొట్టారని మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో న్యాయాధికారి ఎండీ గౌస్ అతడి స్టేట్‌మెంట్ రికార్డు చేసి వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు పంపారు. అయితే వైద్య పరీక్షల్లో సాయి భార్గవ్ శరీరంపై ఎటువంటి దెబ్బలు లేవని, ఎక్స్‌రేలో కూడా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. కోర్టులో ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సుకుమార్ వాదనలు వినిపించారు.
ప్రతాపరెడ్డి ఖాతాకు భరత్ నుంచి నగదు బదిలీ
చంద్రబాబు మార్ఫింగ్ వీడియోలను పబ్లిక్ మైక్ అనే యాప్ ద్వారా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలు సృష్టించిన భరత్ ఖాతా నుంచి.. నిందితుడు ప్రతాపరెడ్డి ఖాతాకు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. నిందితులు మహిళల అక్రమ రవాణాలోనూ పాల్గొన్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. దీంతో సీఐడీ అధికారులు ఆయా సెక్షన్లను కూడా జోడించారు.