Arjun Reddy: వైసీపీ సోషల్ మీడియా నేతకు నోటీసులు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:34 AM
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డికి గుడివాడ టూ టౌన్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని పేర్కొన్నారు..
బాబు, పవన్ కుటుంబాలపై అప్పట్లో అసభ్యకర పోస్టులు, దూషణలు
2024లో గుడివాడలో కేసు.. షార్జా నుంచి రావడంతో చర్యలు
విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డికి గుడివాడ టూ టౌన్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన అర్జున్‌రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేశాడు. నాటి విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టడమే కాకుండా దూషణలకు దిగాడు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో గుడివాడకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఖాజాబాబు, అర్జున్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఖాజాబాబుతోపాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అర్జున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆయనకు 41ఏ కింద నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి అర్జున్‌రెడ్డి గుడివాడ పోలీసులకు చిక్కడం లేదు. సోమవారం షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, బయటకు వస్తుండగా విమానాశ్రయ సిబ్బంది అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుడివాడ పోలీసులు 41ఏ నోటీసు అందజేశారు.