Share News

Sajjala Ramakrishna Reddy: జనాన్ని అయోమయంలోకి నెట్టేద్దాం!

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:02 AM

రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించామంటూ వైసీపీ చెప్పుకొన్నవన్నీ ఉత్త గొప్పలేనని తేలిపోయింది. జగన్‌ హయాంలో ప్రకటించిన ఈ కాలేజీల్లో 5 మాత్రమే అరకొరగా పూర్తవడంతో....

Sajjala Ramakrishna Reddy: జనాన్ని అయోమయంలోకి నెట్టేద్దాం!

  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంటూప్రభుత్వంపై విషం చిమ్ముదాం

  • కట్టని కళాశాలలను ప్రైవేటుకు ఇస్తున్నారని ప్రచారం చేద్దాం

  • ఆందోళనలకు సిద్ధమవుదాం

  • వైసీపీ నేతలకు సజ్జల పిలుపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించామంటూ వైసీపీ చెప్పుకొన్నవన్నీ ఉత్త గొప్పలేనని తేలిపోయింది. జగన్‌ హయాంలో ప్రకటించిన ఈ కాలేజీల్లో 5 మాత్రమే అరకొరగా పూర్తవడంతో, మిగతా వాటిని పూర్తిచేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈ విషయంలో పూర్తిగా అభాసుపాలైన వైసీపీ పెద్దలు... ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు దారులు వెతుకుతున్నారు. వైద్యరంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందంటూ గత బుధవారం మాజీ సీఎం జగన్‌ బురద చల్లారు. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కూటమి నేతలు.. పునాదులకే పరిమితమైన వైద్య కళాశాలల దగ్గరకు వెళ్లి జగన్‌ మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. దీంతో వైసీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో ఇప్పుడు విష ప్రచారం కొనసాగించడం ద్వారా ప్రజలను అయోమయంలోకి నెట్టేసే పనిని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలపై వేసుకున్నారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణం అనే మాటెత్తకుండానే నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. అసలు నిర్మాణాలే చేయని కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు. ఈ ప్రచారాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని శనివారం నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైసీపీ నేతలకు సజ్జల నూరిపోశారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేద్దామంటూ పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే కట్టిన మెడికల్‌ కాలేజీల్లోనూ ప్రైవేటీకరణ అమలు చేస్తారని జనానికి చెప్పాలని సూచించారు. పనులు జరగక, పిచ్చిమొక్కలతో నిండి ఉన్న మెడికల్‌ కాలేజీల వద్ద కూటమి నేతలు ఆందోళనలు చేసి, ప్రజలకు వాస్తవాలను చెబుతుండటంతో ఇరకాటంలో పడ్డ వైసీపీ... ఇప్పుడు ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు సిద్ధం కావడంపై రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Sep 14 , 2025 | 04:02 AM