Share News

Chandraiah Son Job Bill: చంద్రయ్య కుమారుడి ఉద్యోగ బిల్లుకు వైసీపీ అడ్డు

ABN , Publish Date - Sep 28 , 2025 | 06:01 AM

పల్నాడు జిల్లాలో.. రాజకీయ ప్రేరేపిత ఘర్షణల్లో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించే సవరణ బిల్లును వైసీపీ అడ్డుకుంది.

Chandraiah Son Job Bill: చంద్రయ్య కుమారుడి ఉద్యోగ బిల్లుకు వైసీపీ అడ్డు

  • మండలిలో విపక్షం తీవ్ర రభస

  • డివిజన్‌ కోరిన వైసీపీ సభ్యులు

  • బిల్లు రిజర్వ్‌.. నిరవధిక వాయిదా

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో.. రాజకీయ ప్రేరేపిత ఘర్షణల్లో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించే సవరణ బిల్లును వైసీపీ అడ్డుకుంది. తొలుత ఏపీ పబ్లిక్‌ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ రెండవ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల మండలిలో ప్రవేశ పెట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పల్నాడుజిల్లాలో రాజకీ య ప్రేరేపిత ఘర్షణల్లో తోట చంద్రయ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు తోట వీరాంజనేయులును జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి బిల్లులో చేసిన సవరణలను ఆమోదించాలి. ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతాల్లో గతంలో ఇళ్లలోకి వచ్చి చంపేసేవారు. అలా చనిపోయిన బాధితుల కుటుంబాలకు గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు.’’ అని అన్నారు.


ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించినట్టే: బొత్స

చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును వైసీపీ తిరస్కరించింది. విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లు రాజకీయపరమైంది. మాకు మానవ త్వం ఉంది. అయితే రాజకీయ పరమైన అంశానికి ప్రభు త్వ ఉద్యోగం ఇచ్చేలా చట్టసవరణ చేస్తే భవిష్యత్తు తరాలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు?. శాశ్వత ఉద్యోగం ఇవ్వడం సరికాదు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ ఘర్షణలను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఈ అంశాన్ని ప్రభు త్వం పునఃపరిశీలించాలి.’’ అని అన్నారు. ఈ సవరణ బిల్లుపై డివిజన్‌ కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు.. బిల్లును రిజర్వ్‌లో ఉంచి, సభను నిరవధికంగా వాయిదా వేశారు.


ఇస్తే తప్పులేదు: వైసీపీ ఎమ్మెల్సీ

చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే సవరణ బిల్లును వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం సమర్థించారు. ‘‘చంద్రయ్య మా ప్రాంతవాసి. ప్రభుత్వం నక్సల్స్‌ బాధితులకు, ఉద్యోగ విధుల్లో ఉండి చనిపోయిన వారికి బెనిఫిట్స్‌ ఇస్తోంది. చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయడంలో అభ్యంతరం లేదు. పెద్దలు ప్రతిపాదించింది రాజకీయం అనుకోకూడదు. ఇది మంచి ప్రతిపాదన.’’ అని ఏసురత్నం అన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 06:03 AM