Share News

Mithun Reddy Remand Number: మిథున్‌ రెడ్డి రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 4196

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:09 AM

జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి (ఏ4)కి రిమాండ్‌ ఖైదీ నంబరు 4196 ఇచ్చారు.

Mithun Reddy Remand Number: మిథున్‌ రెడ్డి  రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 4196

  • రాజమండ్రి జైలు స్నేహ బ్యారక్‌లో రిమాండ్‌ ఖైదీగా వైసీపీ ఎంపీ

  • మంచం, టీవీ, వాటర్‌ బాటిల్‌, ప్రొటీన్‌ పౌడర్‌ ఇవ్వాలని పిటిషన్‌

  • 2 పూటలా ఇంటి నుంచి భోజనం.. అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి

  • ఉదయం నుంచి సాయంత్రం వరకూ జైలు బయటే ద్వారకానాథ్‌ రెడ్డి

  • మిథున్‌ రెడ్డికి రిమాండ్‌ ఖైదీ నంబర్‌ కేటాయింపు

రాజమహేంద్రవరం/విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి (ఏ4)కి రిమాండ్‌ ఖైదీ నంబరు 4196 ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న స్నేహ బ్యారక్‌లో ఆయన్ను ఉంచారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకూ మిథున్‌ రెడ్డికి రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఆయన్ను అదే రోజు రాత్రి పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. రాత్రి 8.50 గంటలకు అడ్మిషన్‌ తీసుకున్నామని సూపరింటెండెంట్‌ రాహుల్‌ తెలిపారు. జైలు మెడికల్‌ అధికారితో ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించగా ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలో ఉందని తెలిపారు. ఆయనకు ప్రత్యేక సదుపాయాలు ఏమీ ఉండవని, భద్రత విషయంలో మాత్రం అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వివరించారు. సోమవారం ములాఖత్‌ తీసుకొని ఆయనను ఎవరూ కలవలేదని, లాయర్లు కూడా రాలేదని వెల్లడించారు. జైలు నిబంధనల ప్రకారమే ఆయనకు ఆహారం అందించామని చెప్పారు. కాగా సోమవారం ఉదయం మిథున్‌ రెడ్డి చిన్నాన్న, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి తన అనుయాయులతో సుమారు 10 కార్లలో జైలు వద్దకు చేరుకున్నారు. జైలు ఎదురుగా ఉన్న సెంట్రల్‌ ప్రిజన్‌ కేఫ్‌లో సాయంత్రం వరకూ వేచి ఉండి వెళ్లిపోయారు. అడిషనల్‌ ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఉదయం జైలు వద్దకు వచ్చి వెళ్లిపోయారు.


ఈ సదుపాయాలు ఇవ్వండి

ఆదివారం మిథున్‌ రెడ్డికి రిమాండ్‌ విధించిన సమయంలో జైలులో కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి ఒక చిట్టాతో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంపీగా ఉండడం, వై కేటగిరి భద్రత ఉండడంతో జైలులో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. మంచం, కుర్చీ, టేబుల్‌, టీవీ, సహాయకుడు(అటెండర్‌), ప్యూరిఫైడ్‌ వాటర్‌ బాటిల్స్‌, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగాసనాలు వేసుకోవడానికి మ్యాట్‌, మల్టీవిటమిన్‌ మందులు, చేపనూనె మందులు, ప్రొటీన్‌ పౌడర్‌, దిండు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఇవికాకుండా రెండు పూటలా ఇంటి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయాలని మిథున్‌రెడ్డి ఏసీబీ కోర్టులో సోమవారం మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

మిథున్‌రెడ్డికి మంచం ఇవ్వలేదు

మిథున్‌ రెడ్డికి జైలు అధికారులు మంచం ఇవ్వలేదని, నేలపైనే పడుకోబెట్టారని వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌తో మాట్లాడాలని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ను న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కోర్టులో జైలు సూపరింటెండెంట్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తన తరఫున డీఎస్పీ స్థాయి అధికారిని కోర్టుకు పంపుతానని జైలు సూపరింటెండెంట్‌ జవాబు ఇచ్చారు. దీంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Updated Date - Jul 22 , 2025 | 04:13 AM