Eminent Advocate Mukul Rohatgi: వైసీపీ మద్యం స్కాం కనీవినీ ఎరుగనిది
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:14 AM
జగన్ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం కనీవినీ ఎరుగనిదని, తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి స్కాంను చూడలేదని ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు.
నేనెప్పుడూ ఇలాంటి కుంభకోణం చూడలేదు
మోహిత్ తన కారులో సొమ్ము తరలించారు
సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి
సర్కారుకు నోటీసు.. చెవిరెడ్డికి మధ్యంతర రక్షణ
న్యూఢిల్లీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం కనీవినీ ఎరుగనిదని, తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి స్కాంను చూడలేదని ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం విధానంలో మార్పులు చేసి, దేశంలో ప్రముఖ కంపెనీలుగా చెలామణిలో ఉన్న బ్రాండ్స్‌ను తీసేసి.. అనామక బ్రాండ్లను ప్రోత్సహించిందని తెలిపారు. ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణం విలువ రూ.3500 కోట్లని వివరించారు. వైసీపీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వాస్తవానికి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిదార్థ లూథ్రా, సిదార్థ్ అగర్వాల్ హాజరయ్యారు. ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘‘మోహిత్‌రెడ్డి తన కారులో భారీ మొత్తంలో డబ్బులు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ముడుపుల రూపంలో తీసుకున్న సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారు. నాసిరకం మద్యాన్ని విక్రయించి జనాన్ని మోసం చేశారు. రూ.వంద కోట్ల నిధులు సమకూర్చుకున్నారు. వాటినే ఎన్నికల్లో ఖర్చు చేశారు.’’ అని రోహత్గి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు మోహిత్‌రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది.