Jagan Mohan Reddy: డబ్బు పట్టు.. జై కొట్టు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:56 AM
రాజకీయ సభలకు డబ్బులిచ్చి జనాన్ని పోగేసే వాళ్లను చూశాం. పెయిడ్ సన్మానాలు చేయించుకుని... పెయిడ్ ప్రేక్షకులను పిలిపించుకునే వాళ్ల గురించీ తెలుసు....
ఆహ్వానపత్రిక ఇచ్చినవారికి వైసీపీ నేతల వింత షరతులు
జగన్‌కు జేజేలు కొట్టించాలని కండీషన్
‘ఖర్చు’ తామే ఇస్తామని హామీ.. వైసీపీ అధినేత కొత్త ట్రెండ్!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాజకీయ సభలకు డబ్బులిచ్చి జనాన్ని పోగేసే వాళ్లను చూశాం. ‘పెయిడ్’ సన్మానాలు చేయించుకుని... ‘పెయిడ్’ ప్రేక్షకులను పిలిపించుకునే వాళ్ల గురించీ తెలుసు! ఇది... మరింత వెరైటీ! ‘‘జగన్ వస్తారు. ఆయన రాగానే... సీఎం సీఎం.. జై జగన్... అని జేజేలు కొట్టించాలి. ఫ్రీగా అక్కర్లేదు... ఈ డబ్బులు తీసుకుని జనాన్ని అరేంజ్ చేయండి’’ అంటూ వైసీపీ నేతలు కొత్త ట్రెండు మొదలుపెట్టారు. ఇటీవల జగన్ పెళ్లి రిసెప్షన్లు, పరామర్శలకు బాగానే వెళ్తున్నారు. పెళ్లి ఆహ్వానం అందగానే... ‘రిసెప్షన్ మాత్రం జగన్ వచ్చేందుకు అనుకూలమైన ప్రదేశంలో పెట్టండి’ అని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. ఇందులోనూ ‘రాజకీయం’ దాగుంది. జగన్ రాజకీయ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. జనం వద్దకు వెళ్లడానికి సమస్యలు, అక్కడ వినిపించడానికి గట్టి నినాదాలు వైసీపీకి లేని పరిస్థితి. దీంతో... పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లి అక్కడైనా హడావుడి చేయాలన్నదే వైసీపీ నేతల ఉద్దేశం. ఓ మోస్తరు నేతలు, వ్యక్తులు ఎవరు వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చినా ‘వస్తాను..’ అంటూ ముందే జగన్ చెప్పేస్తున్నారు. పీఏను పిలిచి డైరీలో వివరాలు రాసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత జగన్ మనుషులు రంగంలోకి దిగి ఆహ్వానితుల ముందు తమ ‘ఎజెండా’ పెడతారు. జగన్ వచ్చే సమయానికి ఎంతమంది ప్రాంగణంలో ఉండాలి.. శుభకార్యం జరిగే హాలు, వేదిక వద్ద ఎందరు ఉండాలి.. అందులో మహిళలు .. యువకుల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తారు. బయట రాష్ట్రంలో కార్యక్రమం పెట్టుకోకూడదు. ఎందుకంటే.. అక్కడకు వెళ్లి జేజేలు కొట్టించుకుంటే రాజకీయంగా ఉపయోగం ఉండదు కదా! అందుకని పెళ్లి ఎక్కడ చేసుకున్నా రిసెప్షన్ మాత్రం రాష్ట్రంలోనే నిర్వహించాలి. రిసెప్షన్ తీరుతెన్నులపైనా జగన్ మనుషులే డైరెక్షన్ ఇస్తారట! ఇదంతా ఓకే అయితే.. అసలు విషయంలోకి వస్తారు. ‘సీఎం.. సీఎం.. జగన్.. జగన్..’ అంటూ జేజేలు కొట్టేందుకు మనుషులను ఏర్పాటు చేయడం తప్పనిసరి. అందుకు అయ్యే ఖర్చు కూడా చెల్లిస్తున్నారు. అంతే... ఫంక్షన్ హాలులో ఇలా జగన్ అడుగు పెట్టడం... జై జగన్, సీఎం సీఎం అనే నినాదాలు హోరెత్తడం! ఈ ‘అరేంజ్డ్ హడావుడి’ని రోతమీడియా ‘ఓ రేంజ్’లో కవర్ చేస్తుంది. ఇతర అనుకూల చానళ్లు, నచ్చిన సోషల్ మీడియా ఆ రోజంతా ఊదరగొడతాయి! ఇదీ ప్లాన్!