YSRCP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - May 03 , 2025 | 05:28 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ నేత వల్లభనేని వంశీకి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కులం పేరుతో దూషణ కేసులో బెయిల్ మంజూరు చేయలేదు. వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించి వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున బెయిల్‌ను నిరాకరించింది.
ఆయన పాత్రపై ఆధారాలున్నాయి: హైకోర్టు
బెయిలిస్తే ఫిర్యాదుదారును బెదిరించవచ్చు
సాక్షులను ప్రభావితం చేయొచ్చు
ప్రాసిక్యూషన్ ఆందోళన సమర్థనీయమే
తీర్పులో న్యాయమూర్తి స్పష్టీకరణ
ఇతర నిందితులకు బెయిల్ మంజూరు
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. వైౖసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు మూకదాడి చేసి వాహనాలను తగులబెట్టడమే గాక.. పలువురిపై దాడి చేసి గాయపరిచారు. పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కులం పేరుతో దూషించారు. ఈ వ్యవహారంపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలువురిని నిందితులుగా చేరుస్తూ 2023 ఫిబ్రవరి 22న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వంశీకి బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘కోర్టు ముందు ఉన్న వివరాలను పరిశీలిస్తే వంశీ అనుచరులు ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను బెదిరించి, బలవంతంగా కోర్టుకు తీసుకెళ్లి కేసును ఉపసంహరించుకునేలా వాంగ్మూలం ఇప్పించినట్లు అర్థమవుతోంది.
ఘటనలో వంశీ పాత్రపై ఆరోపణలకు మద్దతుగా ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు సంస్థ సేకరించింది. కేసును ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారును బలవంతం చేయడంలో వంశీ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే.. కేసులో ఇతర నిందితులతో సమానంగా ఆయన బెయిల్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకునేవాళ్లం. కానీ ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన వాంగ్మూలాలను పరిశీలిస్తే ఘటనలో పిటిషనర్ పాత్రపై ప్రాఽథమిక ఆధారాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. చార్జిషీటు దాఖలు చేయబోతున్నారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడొ చ్చు. ఫిర్యాదుదారును బెదిరించడం వంటి ఘటనలుపునరావృతం చేయొ చ్చు. పిటిషనర్‌ను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివి చేయవచ్చన్న ప్రాసిక్యూషన్ తరఫు సీనియర్ న్యాయవాది ఆందోళన సమర్థనీయమే’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటే బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు. కాగా.. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కైలా ఆదిలక్ష్మి, కైలా శివకుమార్, నీలం ప్రవీణ్‌కుమార్, రాచేటి రూతమ్మ, మహ్మద్ మౌలా నా అబ్దుల్ కలామ్, షేక్ సర్దార్ జానీకి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..