Share News

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో మరో వైసీపీ నేత

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:15 AM

ఒకప్పుడు అతనొక ఎర్రచందనం స్మగ్లర్‌. పలుమార్లు అరెస్టై జైల్లో నెలల తరబడి ఉన్నాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాకతో అతని దశ దిశ అన్నీ తిరిగాయు.

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో మరో వైసీపీ నేత

  • విజయానంద రెడ్డిని విచారించిన సిట్‌

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు అతనొక ఎర్రచందనం స్మగ్లర్‌. పలుమార్లు అరెస్టై జైల్లో నెలల తరబడి ఉన్నాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాకతో అతని దశ దిశ అన్నీ తిరిగాయు. చిత్తూరు నుంచి ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించాడు. అది దక్కక పోయినా ఐదేళ్లపాటు అన్నీ తానై చెలాయించాడు. ఏపీఎ్‌సఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని రూ. కోట్లు సంపాదించాడు. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో కలిసి దక్షిణాఫ్రికాలో మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరాడు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకున్నా కూటమి ఊపులో ఓటమి పాలయ్యాడు. అతనెవరో కాదు చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి. వైసీపీ హయాంలోని లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ సోమవారం విజయానంద రెడ్డిని విచారించింది. చెవిరెడ్డితో నిరంతరం అంటకాగిన విజయానంద రెడ్డి పాత్ర లిక్కర్‌ స్కామ్‌లో వెలుగులోకి వచ్చింది. మద్యంను డిపోల నుంచి షాపులకు తరలించేందుకు ఆయన కాంట్రాక్టు పొందారు. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్‌పోర్టర్లకు ఇస్తున్న మొత్తం కన్నా ఎక్కువకు దక్కించుకున్నాడు. అందులో అధిక మొత్తం వైసీపీ పెద్దలకు ఇచ్చాడు. తాను సంపాదించిన సొమ్ము పెట్టుబడులు పెట్టేందుకు చెవిరెడ్డితో కలిసి పలుమార్లు ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చాడు. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచన మేరకు లిక్కర్‌ ముడుపుల్ని వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు సిట్‌ గుర్తించింది. వీటన్నింటిపై సుదీర్ఘంగా సిట్‌ అధికారులు సోమవారం ప్రశ్నించారు. మొదట తనకు ఏమీ తెలియదని, మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే చేశానని చెప్పిన అతను.. సిట్‌ అధికారులు చూపిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదు. రాత్రి 9 గంటల వరకూ ప్రశ్నించిన సిట్‌ అధికారులు మరోమారు రావాలంటూ పంపించినట్లు తెలిసింది.

Updated Date - Sep 02 , 2025 | 06:15 AM