Nidigunta Aruna: నీ సంగతి చూస్తా
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:36 AM
నువ్వు నాకు డబ్బులిచ్చావా? ఎప్పుడిచ్చావు? కంగారు పడకు.. నీ సంగతి చూస్తా. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత నిన్ను నాశనం చేస్తా’....
నువ్వు నాకు డబ్బులిచ్చావా?
బయటికొచ్చాక నాశనం చేస్తా
ఫిర్యాదుదారుపై కి‘లేడీ’ అరుణ
కోర్టు ప్రాంగణంలో చిందులు
విజయవాడ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ‘నువ్వు నాకు డబ్బులిచ్చావా? ఎప్పుడిచ్చావు? కంగారు పడకు.. నీ సంగతి చూస్తా. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత నిన్ను నాశనం చేస్తా’.. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాను శాసించిన కి‘లేడీ’ నిడిగుంట అరుణ శుక్రవారం విజయవాడ కోర్టుల ప్రాంగణంలో చేసిన వీరంగం ఇది. ఆమెపై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి రమేశ్‌బాబు అనే వ్యక్తి చూసి.. పోలీసుల సమక్షంలోనే అరుణ ఊగిపోయింది. రమేశ్ నుంచి వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.24.50 లక్షలను రెండు వితలుగా అరుణ వసూలు చేసింది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న అరుణను పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి రమే్‌షబాబు అక్కడికి వెళ్లారు. కోర్టు ప్రాంగణంలో అతన్ని చూసిన అరుణ చిందులేసింది. ‘‘నువ్వు నాకు డబ్బులిచ్చావా? ఎక్కడిచ్చావు.. కంగారు పడకు.. బయటికి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా. నిన్ను నాశనం చేస్తా’’ అంటూ చిందులు వేసింది. దీంతో పోలీసులు ఆమెను వేగంగా కోర్టు హాలు వద్దకు తీసుకెళ్లారు.
ఇదీ కేసు..: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుకు చెందిన వాసిరెడ్డి రమేశ్‌బాబు విజయవాడలో ఉంటున్నారు. వైసీపీ హయాంలో ఒక యువకుడికి ఎస్‌ఐ ఉద్యోగం, మరో మహిళకు అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం పర్మినెంట్ చేయడానికి ఇబ్రహీంపట్నంలో ఉండే సురేంద్ర అనే వ్యక్తిని కలిశాడు. ఆయన.. మంగళగిరి పోలీసు కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తి పేరు చెప్పాడు. తర్వాత పది రోజులకు బంగారి ఫోన్ చేసి రమేశ్‌బాబును విజయవాడలోని ఓ హోటల్‌కు రమ్మని చెప్పాడు. ఎస్‌ఐ పోస్టుకు రూ.18.50 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుకు రూ.6 లక్షలు అవుతుందని రేటు చెప్పాడు. ఈ మేరకు 2021 మార్చి 19న నిడుగుంట అరుణ, బుల్లెట్ బాబు అనే ఇద్దరు కారులో విజయవాడ వచ్చి కలవగా, రమేశ్‌బాబు వారికి రూ.12 లక్షలు ఇచ్చాడు. మరో పది రోజుల తర్వాత బుల్లెట్‌బాబు వచ్చి రూ.12.50 లక్షలు తీసుకున్నాడు. పని జరగకపోడంతో ఆ మొత్తం తిరిగివ్వమని రమేశ్‌బాబు పలుమార్లు నెల్లూరు వెళ్లి అరుణను అడిగితే అనుచరులతో బెదిరించింది. దీనిపై రమే్‌షబాబు ఈ ఏడాది అక్టోబరు 13న సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఇప్పటికే ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న అరుణను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి ఒంగోలు జైలుకు తరలించారు.