Karumuri Venkata Reddy: వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:36 AM
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు....
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాడిపత్రి/గుంతకల్లు/కేపీహెచ్‌బీకాలనీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన ఇంటిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ మాజీ ఏవీఎ్‌సఓ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పలు విమర్శలు చేశారు. ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత చింబిలి ప్రసాద్‌నాయుడు ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి సిబ్బంది హైదరాబాదులో అరెస్టు చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని, బాత్రూమ్‌లోకి వెళ్లి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది. అయినా పోలీసులు వెనక్కితగ్గకపోవడంతో అరగంట తర్వాత వెంకటరెడ్డి లొంగిపోయినట్లు సమాచారం. తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని వెంకటరెడ్డి భార్య హరిత కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కాగా, వెంకటరెడ్డిని మంగళవారం రాత్రి తాడిపత్రి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.