Swachh Andhra Chairman Pattabhiram: లిక్కర్ స్కాంలో భూమన
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:11 AM
గత వైసీపీ హయాంలో పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబరులోగా శుభ్రం చేయిస్తాం. ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు...
త్వరలో ఆయన్ను విచారించే అవకాశం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి
తిరుపతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ హయాంలో పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబరులోగా శుభ్రం చేయిస్తాం. ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు’ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్ స్కాంలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి కూడా సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఆయన సన్నిహితులు మద్యం కుంభకోణంలో ఉన్నట్టు పేర్లు బయటకు వచ్చాయి. త్వరలోనే భూమనను కూడా విచారించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భూమన లాంటి చీడపురుగులను సమాజం నుంచి ఏరిపారేస్తాం. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా..భూమన తన పద్ధతి మార్చుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు ఆధారాలతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తండ్రి, కొడుకు(కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి)లు ఒకే జైలులో ఊచలు లెక్కపెట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి‘ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ పాల్గొన్నారు.