YSRCP Shyamala: అధిష్ఠానం డైరెక్షన్ మేరకే మాట్లాడా
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:58 AM
కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామలతో పాటు మరో నలుగురు సోమవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం కేసులో
విచారణకు వైసీపీ నేత, యాంకర్ శ్యామల హాజరు
ఆరోపణలకు ఆధారాలు అడిగిన పోలీసులు
కర్నూలు క్రైం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామలతో పాటు మరో నలుగురు సోమవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట ఆమె హాజరయ్యారు. డీఎస్పీతోపాటు మరో పది మంది టెక్నికల్ బృందం ఈ విచారణలో పాల్గొన్నారు. 2 గంటల పాటు సాగిన విచారణలో పోలీసులు 60కి పైగా ప్రశ్నలు సంధించారు. శివశంకర్ అనే యువకుడు కల్తీ, బెల్టు షాపులో కొన్న మద్యం తాగి బైక్ నడపడం వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ తాడేపల్లి మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు పోలీసులు శ్యామలను ఆధారాలు అడిగారు. దీనికి వైసీపీ అధిష్ఠానం తనకు ఇచ్చిన సమాచారం మేరకే ప్రెస్‌మీట్‌లో మాట్లాడినట్లు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం శ్యామల బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. శివశంకర్ బెల్టు షాపులో మద్యం తాగినట్లు తమ పార్టీ వద్ద సమాచారం ఉందన్నారు. పోలీసు విచారణకు సీఎన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వెంకటరెడ్డి, నవీన్‌లు కూడా హజరయ్యారు.