గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం: మంత్రి అనిత
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:07 AM
‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లూ భయానకమైన అనుభవాలను చూశాం. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి వేధించారు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లూ భయానకమైన అనుభవాలను చూశాం. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి వేధించారు. ప్రస్తుత శాసనసభలో సీఎం చంద్రబాబుతో సహా... దాదాపు ఎమ్మెల్యేలందరిపై అక్రమ కేసులున్నాయి’ అని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్ట్ర హోం శాఖకు నిధులు అభ్యర్థిస్తూ మంగళవారం శాసనసభలో ఆమె ప్రవేశపెట్టిన డిమాండ్‌పై చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం మంత్రి అనిత సమాధానమిచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాం. ప్రతి పోలీసు స్టేషన్‌లో సీసీటీవీలతోపాటు 2 డ్రోన్లు అందుబాటులో ఉంచుతాం. ఇప్పుడు ప్రతి పోలీసుస్టేషన్‌కు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ఇస్తాం. గత ప్రభుత్వం రూ.12 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో సీసీ కెమెరాల వ్యవస్థ మూలనపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను పునరుద్ధరించాలనేది లక్ష్యం. ఇప్పటికే 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అమరావతిలో ఫొరెన్సిక్ ల్యాబ్ పనులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ ఆ ల్యాబ్ పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.