YSRCP Fake GOs: ప్రభుత్వంలో వైసీపీ ఫేక్‌లు
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:05 AM
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా వైసీపీ ఫేక్ గ్యాంగులు రోజు రోజుకూ బరితెగిస్తున్నాయి. ఏకంగా ఫేక్ జీవో(నకిలీ ఉత్తర్వులు)లు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అమరావతిపైనా..
ఏకంగా ఫేక్ జీవోల సృష్టి
సర్కారు ప్రతిష్ఠ దిగజార్చే యత్నం
సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతిపరుల హల్‌చల్
వారి అండతోనే జీవోలు.. లీకులు
నాడు జగన్ ప్రమాణ స్వీకారంతోపాటే సచివాలయం, శాఖల్లో ఒకేసారి బదిలీలు
కూటమి సర్కారులో నేటికీ మీనమేషాలు
నకిలీ పోస్టులు, జీవోలపై ఖండనకే సరి
కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే
వైసీపీ ఫేక్ ముఠా పేట్రేగి పోతోంది. ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో.. గుర్తించలేనంతగా చెలరేగిపోతోంది. ఇప్పటి వరకు రాజధాని అమరావతిపై విషం కక్కిన వైసీపీ నకిలీ ముఠా.. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ చొరబడింది. జీవోల విషయంలోనూ నకిలీ మకిలి అంటిస్తోంది. ఈ బురదను కడుక్కోవడం, నకిలీలకు చెక్ పెట్టడం వరకే పరిమితమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఫేక్ ముఠాపై కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
నకిలీ: అమరావతిలో కుల వివక్ష అంటూ వీడియోల హల్‌చల్.
నిజం: తమిళనాడులో జరిగిన ఘటనకు మసిపూసి ఇక్కడ జరిగినట్టుగా ఫేక్ ప్రచారం.
నకిలీ: జీవో 1575ను సృష్టించి.. ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వలేక.. విరమణ వయసు పెంచారని ప్రచారం.
నిజం: జీవో 1575.. ఓ ఐఏఎస్ అధికారి ఇంటి అద్దెకు సంబంధించిన జీవో.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా వైసీపీ ఫేక్ గ్యాంగులు రోజు రోజుకూ బరితెగిస్తున్నాయి. ఏకంగా ఫేక్ జీవో(నకిలీ ఉత్తర్వులు)లు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అమరావతిపైనా.. దివ్యాంగుల పింఛన్లపైనా అసత్య ప్రచారాలు చేసిన వైసీపీ ఫేక్ ముఠా.. ఈసారి ఫేక్ జీవోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు హల్చల్ చేసిన నకిలీ జీవో.. ఈ ఫేక్ గ్యాంగ్ బరితెగింపునకు నిదర్శనం.
ఆగస్టు 29న జీవో(ఆర్టీ) నంబరు 1575ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో పదవీ విరమణ వయసును 65 ఏళ్లకి పెంచిందంటూ తప్పుడు ప్రచారానికి తెరదీశారు. వాస్తవానికి జీవో 1575ను ఆగస్టు 28నే విడుదల చేశారు. అది ఓ ఐఏఎస్ అధికారి నివాసం అద్దెకు సంబంధించిన జీవో. అంతేకానీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించింది కాదు. ఆగస్టు 22న ప్రభుత్వం జీవో(ఆర్టీ) నంబరు 1545ను విడుదల చేసింది. దీనిని ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62కి పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు మంత్రివర్గ బృందాన్ని నియమిస్తూ విడుదల చేశారు. వీటన్నింటినీ మరుగునపరుస్తూ.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా వైసీపీ గ్యాంగులు తప్పుడు జీవోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో నకిలీ జీవో, వాస్తవ జీవోలను పక్కపక్కన పెట్టి వివరణ ఇచ్చి వదిలేసింది. కానీ, అదేసయమంలో తప్పుడు జీవోలు సృష్టించిన వారిపై కఠినచర్యలు తీసుకునే దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.
ఉదాసీనతే వారి ధైర్యం
రాజధాని అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసినా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఊడిపోయి విజయవాడ నగరం మునిగిపోనుందని అసత్య కథనాలు వండివార్చినా.. చేతులు బాగుండీ.. లేనట్టు నటిస్తూ తనకు వస్తున్న దివ్యాంగుల పింఛను తొలగించారంటూ డ్రామా ఆడినా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోదు. మహా అయితే చిన్నపాటి కేసులతో సరిపెట్టేస్తుంది అన్న ధైర్యమే వైసీపీ ఫేక్ ముఠా రెచ్చిపోవడానికి కారణమవుతోంది. ఆ బరితెగింపే ఇప్పుడే ఏకంగా ప్రభుత్వంలోకి చొరబడేలా చేసింది. జీవోల రూపకల్పన తీరుతెన్నులు బాగా తెలిసిన వారే ఫేక్ జీవోలను సృష్టించగలరు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్ర స్థానమైన సచివాలయంలోని కీలక విభాగాల్లో ఇప్పటికీ అధికశాతం మంది వైసీపీ వీరాభిమానులే విధులు నిర్వహిస్తున్నారు. వీరి అండతోనే వైసీపీ ఫేక్ గ్యాంగ్ ఏకంగా నకిలీ జీవోలను సృష్టించగలుగుతోంది.
వెంట్రామిరెడ్డి రెడ్డి హవా!
వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నా రు. అయినా, ఆయన హవానే సచివాలయంలో ఇంకా నడుస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపి, చర్చనీయాంశంగా మారిన శ్రీకాంత్ పెరోల్ జీవో విడుదలలో అసలేం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఇంత వరకు నిగ్గు తేల్చలేకపోయారు. సచివాలయంలో కీలక స్థానాల్లో ఉన్న జగన్ వీరాభిమానులే ఈ పనులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
నాడు ముందే మార్పులు
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన మరుక్షణం సచివాలయంలోని కీలక అధికారులపై దృష్టి సారించింది. జగన్ ప్రమాణస్వీకారం జరుగుతుండగానే సచివాలయంలో కీలక స్థానాల్లో ఉన్నవారందరినీ బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండరని భావించిన అధికారులందరినీ పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని అనుమానించి కొందరు సెక్షన్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా సచివాలయంలోని కీలక స్థానాల్లో అధిక శాతం మంది వైసీపీ మద్దతుదారులే ఉన్నారు. మంత్రుల పేషీల్లోనూ వైసీపీ సానుభూతిపరులే పాగా వేశారు. సీఆర్డీయే వంటి కీలక విభాగంలోనూ జగన్ అనుకూలురే చక్రం తిప్పుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులను మార్పు చేయాల్సి ఉంది. కానీ, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. దాని ఫలితంగా తాము ఏం చేసినా ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో వైసీపీ సానుభూతిపరులైన కొందరు అధికారులు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వైసీపీకి చేరవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను ఎక్కడ దిగజారేలా చేయవచ్చో వీరే.. వైసీపీ నేతలకు సలహాలు ఇచ్చి మరీ మీడియా ముందు మాట్లాడిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
అమరావతిపై ఆగని కక్షసాధింపు
నిన్నటి వరకు అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేసిన వైసీపీ ఫేక్ ముఠాలు ఇప్పటికీ రాజధానిపై రకరకాలుగా విషం చిమ్ముతూనే ఉన్నాయి. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను రెండు రోజుల క్రితం పోస్టు చేసి దాన్ని విజయవాడలో జరిగినట్లు చూపారు. ‘అమరావతి ఎప్పటికీ ఆంధ్రుల రాజధాని కాలేదు.’ అంటూ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేశారు. ఆ వీడియోలో ఓ దళిత మహిళకు దూరంగా నిలబడి.. ఓ అగ్రవర్ణ మహిళ చెంబుతో నీరు పోస్తున్నట్లు ఉంది. ఈ వీడియోను పోస్టు చేసి అమరావతిలో కులగజ్జి ఉందంటూ వైసీపీ ఫేక్ గ్యాంగ్ ప్రచారం చేసింది. ఈ ఫేక్ పోస్టుపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ మరో పోస్టు చేశారు. ‘అమరావతిపైనా.. ఆంధ్రప్రదేశ్‌పైనా మీ కక్ష ఇంకా తీరలేదా జగన్ రెడ్డీ?. తమిళనాడులోని వీడియోను తెచ్చి అమరావతిలో అంటూ ప్రచారం చేయించారు. అమరావతి అందరిదీ.. ఇక్కడ వివక్ష ఉండదు. ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల కుంపట్లు, మతాల మధ్య మంటలు రేపి చలికాచుకునే మీ కుతంత్రాలకు కాలం చెల్లింది.’ అని లోకేశ్ ప్రతిస్పందించారు. వైసీపీ ఫేక్ గ్యాంగులు ఫేక్ పోస్టులు పెట్టడం, వాటికి కూటమి పెద్దల ఖండనలు.. ఫ్యాక్ట్ చెక్‌లు పెట్టుకోవడం సమస్యకు పరిష్కారం కాదని పలువురు చెబుతున్నారు. అవాస్తవాలను ప్రచారం చేసే నకిలీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడితినే ఈ ఫేక్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని సూచిస్తున్నారు.