Sharmila: హామీలు బారెడు.. అమలు మూరెడు
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:26 AM
ఆటో డ్రైవర్లను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికీ, కూటమి సర్కారుకూ తేడాలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు....
వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు తేడా లేదు
ఆటో డ్రైవర్లకు రెండూ మోసం: షర్మిల
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికీ, కూటమి సర్కారుకూ తేడాలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గతంలో జగన్ 2.60 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ఇస్తే, కూటమి ప్రభుత్వం 2.90 లక్షల మందికి రూ.15 వేల చొప్పున ఇచ్చిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోడ్రైవర్లను మోసం చేయడంలో దొందూదొందేనని విమర్శించారు. బ్యాడ్జి ఉన్న ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బ్యాడ్జీ కలిగిన ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉంటే, జగన్ అందులో పదిశాతానికి లోపే(యజమానులకు) అమలు చేశారని, ఇప్పుడు చంద్రబాబూ అదే విధానం అమలు చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు బారెడుంటే, అమలు మాత్రం మూరెడేనని ఆరోపించారు. ఏ పథకాన్ని అమలు చేసినా సగంసగమేనని, అన్నింటా కోతలేనని ఆరోపించారు. ఆటో డ్రైవర్ అన్నలకు చంద్రబాబు చేసింది ఘరానా మోసమేనన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఊదర గొట్టిన ప్రసంగాలకు పొంతనే లేదని విమర్శించారు. కూటమి నేతలు ఖాఖీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులిచ్చారని, డ్రైవర్ అన్నలకు మసిపూసి మారేడు కాయ చేశారని ఆరోపించారు.