YSRCP Accused of Spreading Fake Narratives: ఫేక్‌కు కేరాఫ్ వైసీపీ
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:42 AM
ఫేక్ ప్రచారాలకు వైసీపీ కేరా్‌ఫగా మారింది. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై తప్పుడు ప్రచారమే లక్ష్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారు. రాజధాని ముంపు, యూరియా కొరత, పరిశ్రమలకు భూ కేటాయింపులు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక....
అసత్య ప్రచారంలో సోషల్ సైకోల కొత్త పుంతలు
విద్యుత్తు కోతలంటూ తప్పుడు ఐడీలతో దుష్ప్రచారం
రాష్ట్రంలో కరెంటు కోతలే లేవంటున్న ట్రాన్స్‌కో అధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఫేక్ ప్రచారాలకు వైసీపీ కేరా్‌ఫగా మారింది. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై తప్పుడు ప్రచారమే లక్ష్యంగా ఆ పార్టీ సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారు. రాజధాని ముంపు, యూరియా కొరత, పరిశ్రమలకు భూ కేటాయింపులు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక... ఇలా అంశం ఏదైౖనా వీరు అలవోకగా ఫేక్ ప్రచారం చేసేస్తారు. తాజాగా విద్యుత్తు కోతల పేరుతో దుష్ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తు సరఫరా చేశామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. కానీ వైసీపీ సోషల్ సైకోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఐడీలు సృష్టించి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయని, దానివల్ల జనం జీవితాలు తల్లకిందులు అయిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ‘మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ఇంటర్వ్యూ కరెంటు లేదని రెండుసార్లు రీషెడ్యూల్ చేశారు. తీరా కరెంటు వచ్చిందని ఇంటర్వ్యూ అటెండ్ అయితే మధ్యలో మళ్లీ పోయింది. అసలు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య మీకు అర్థమవుతుందా’ అని మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ ఎరెన్ చౌదరి పేరుతో ఉన్న ఒక ఖాతా నుంచి పోస్టు చేశారు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ల్యాప్‌టా ప్‌ను పూర్తిగా చార్జింగ్ పెట్టుకోవడంతో పాటు ఇంటర్నెట్ డాంగిల్ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కరెంటు పోవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందన్న స్థాయిలో పోస్టు పెట్టిన సదరు నిరుద్యోగి రాష్ట్రంలో అసలు కరెంటు కోతలే లేవన్న విషయాన్ని విస్మరించి మరీ రెచ్చిపోవడం విశేషం. మరోవైపు విజయవాడలో గంటల కొద్దీ కరెంటు పోవడం వల్ల డెలివరీలో జాప్యం జరిగిందని, తమ బేబీకి ఏమన్నా అయితే తాను చనిపోవాల్సిందేనంటూ పెట్టిన పోస్టు ఫేక్ ప్రచారానికి పరాకాష్ఠగా నిలిచింది. వాస్తవానికి ప్రభుత్వాస్పతులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులో అన్నిచోట్లా జనరేటర్లు ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో కోతలు ఉన్నా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి భిన్నంగా బెజవాడలో ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వరకు రాలేదని, దానివల్ల డెలివరీ నిలిచిపోయిందని పోస్టు పెట్టడం వైసీపీ సైకోలకే చెల్లింది.
బురద చల్లడమే లక్ష్యం
చినకు పడినప్పుడల్లా రాజధాని అమరావతి ప్రాంతం ముంపుబారిన పడిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల వీడియోలను తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రచ్చచేశారు. దివ్యాంగుల పింఛన్లలో అర్హులను తొలగించేస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టేందుకు సిద్ధపడ్డారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ పథకాల విషయంలోనూ వైసీపీ తప్పుడు ప్రచారాలకు తెగబడింది.