YSR University: ఉద్యాన వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా గోపాల్ కొనసాగేనా
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:16 AM
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చేస్తున్న జాప్యానికి న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు../
పదవీ విరమణ వయసు పెంపుపై లేఖ
ఇంతవరకూ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
హైకోర్టును ఆశ్రయించిన ఇన్‌చార్జి వీసీ
ప్రొఫెసర్‌గా పదవీ కాలాన్ని పొడిగిస్తేనే వీసీగా అవకాశం!
(భీమవరం-ఆంధ్రజ్యోతి): విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చేస్తున్న జాప్యానికి న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎ్‌సఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం ఇన్‌చార్జ్ వీసీ బి.గోపాల్ విషయమే ఇందుకు నిదర్శనం. ఆగస్టు 31న ఆయనకు 62 ఏళ్లు పూర్తి కావడంతో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేయాలి. ఉద్యోగ విరమణ చేస్తే ఇన్‌చార్జి వీసీగా కొనసాగే అవకాశం లేదు. దీంతో ప్రొఫెసర్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ మూడు నెలల కిందటే గోపాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపక సిబ్బంది పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ నాటి వైసీపీ ప్రభు త్వం జీవో ఇచ్చింది. ఉన్నత విద్యా సంస్థల చట్ట నిబంధనల్లోనూ ఈ 65 ఏళ్ల ప్రస్తావన ఉంది. దీనిపై బి.గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ఈనెల 11న జరగనుంది. గోపాల్ ఇప్పటికీ ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతుండగా.. ఆయన ప్రొఫెసర్ పదవీ కాలంపై హైకోర్టులో కేసు నడుస్తుండటం విశేషం. కాగా, వైసీపీ హయాంలో అప్పటి వీసీ జానకిరామ్‌ను రెండోపర్యాయం కొనసాగించడంలో నిబంధనలు పాటించలేదం టూ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. బి.గోపాల్ విషయంలోనూ కూటమి ప్రభుత్వం అదే తప్పు చేస్తోందనే చర్చ నడుస్తోంది.