Share News

Sunita Reddy: వివేకా హత్యపై తదుపరి దర్యాప్తు జరగాలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:35 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు.

Sunita Reddy: వివేకా హత్యపై తదుపరి దర్యాప్తు జరగాలి

  • లేదంటే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం

  • హత్య విషయం జగన్‌, భారతిలకు ముందే ఎలా తెలుసు?

  • ఎవరు కాల్‌ చేశారు? ఏం చెప్పారు?

  • దర్యాప్తు పూర్తికాకుండా ట్రయల్‌తో ఉపయోగం లేదు

  • సునీత తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు

  • విచారణ శుక్రవారానికి వాయిదా

హైదరాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐకి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆమె నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం విచారణ చేపట్టారు. సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. న్యాయవాది ఎస్‌.గౌతమ్‌ ప్రత్యక్షంగా వాదనలు వినిపించారు. తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సూచించిందని గుర్తుచేశారు. వివేకా హత్య కేసులో లోతైన తదుపరి దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని.. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన పిటిషనర్‌కు పూరించలేని విధంగా మరింత అన్యాయం జరుగుతుందని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు జరిగితే ఇప్పటికీ వెలుగుచూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దర్యాప్తు సంపూర్ణంగా జరగకుండా ట్రయల్‌ చేపట్టడం వల్ల ఉపయోగం లేదని.. అలా చేస్తే న్యాయం జరిగినట్లు కాదని తెలిపారు. ‘వివేకా హత్య విషయం ఆరోజు ఉదయం 5.30 గంటలకే భారతి, జగన్‌లకు తెలిసిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్‌ అయిన ఐఏఎస్‌ అజేయ కల్లం తన స్టేట్‌మెంట్‌లో తెలిపారని గుర్తు చేశారు. ‘ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అటెండర్‌ వచ్చి అమ్మ (వైఎస్‌ భారతి) పైకి పిలుస్తున్నారని తెలుపగా.. జగన్‌ వెళ్లి పది నిమిషాల తర్వాత వచ్చి చిన్నాన్న (వైఎస్‌ వివేకా) ఇక లేరు అని చెప్పారు.


దీంతో మేమంతా షాక్‌కు గురయ్యాం’ అని అజేయ కల్లం తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అయితే.. భారతి, జగన్‌లకు ఈ విషయం ముందే ఎలా తెలిసింది? ఎవరు కాల్‌ చేశారు? ఏం చెప్పారు? అనే విషయాలపై సీబీఐ దర్యాప్తు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయాలు బయటికి వస్తేనే దర్యాప్తులో మిగిలి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడమే కాకుండా అసలు దోషులతోపాటు వాస్తవాలు బయటికొస్తాయని లూథ్రా పేర్కొన్నారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పూర్తికావడంతో నిందితుల తరఫు వాదనల కోసం కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - Nov 14 , 2025 | 05:38 AM