MLA Jammalamadugu Adinarayana Reddy: శంకరయ్య వెనుక వివేకా హంతకులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:12 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఐ శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
పోలీస్ వ్యవస్థ పరువు తీసి... సీఎంకు నోటీసా?
ప్రివిలేజ్ కమిటీ ముందుకు సీఐ వ్యవహారం: ఎమ్మెల్యే ఆది
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఐ శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీస్ పంపడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. ‘‘సీఎంకు నోటీసులు పంపడానికి అతనికున్న హక్కేంటి? అర్హతేంటి? ఆంతర్యమేంటి? మతలబు ఏంటి? ఏమిటీ దురాగతం? ప్రజలను కాపాడాల్సిన రక్షక భట వ్యవస్థ పరువు తీసి, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసినందునే అప్పటి ప్రభుత్వం శంకరయ్యను 2019లో సస్పెండ్ చేసింది. సీబీఐ ముందు మాట్లాడకుండా ఉన్నందుకు 2021లో గత ప్రభుత్వం అతనికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. గత ప్రభుత్వం నిబంధనలను దాటి, అతనికి పోస్టింగ్ ఇచ్చింది. వైసీపీ నేతలతో సీఐ శంకరయ్య కుమ్మక్కై పోలీస్ వ్యవస్థను అప్రదిష్టపాలు చేశారు. అందుకే ప్రస్తుతం అతను వీఆర్‌లో ఉన్నారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం ఏంటీ? వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అనే వ్యక్తి నేరుగా సుప్రీం కోర్టుకే కేసు విషయం చెప్పిన తర్వాత ఈ వ్యవహారమేంటీ? 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవటానికి ఒకానొక కారణం వివేకా హత్య కేసు. ఎన్నికల సమయంలో విజయలక్ష్మి మాట్లాడుతూ... ‘నా భర్తను చంపేశారు. నా కొడుకుని కోడి కత్తితో చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వివేకాను చంపేశారు’ అని అన్నారు.
ఆ మాటలను మహిళలంతా నమ్మేశారు. తర్వాత కేసు ఏ దర్యాప్తు ఎలా జరిగిందో అందరికీ తెలుసు. వివేకా హత్య జరిగిన రోజు రక్తపు మరకలు కడుగుతుంటే శంకరయ్య ఏం చేశారు? ఇప్పుడు సీఎంకు సీఐ శంకరయ్య నోటీసు పంపడం ఏంటి? వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు. ఈ నీచమైన ఘటనపై లోతైన విచారణ చేసి, సీఐని సస్పెండ్ చేయాలని డీజీపీని కోరుతున్నా. ఈ విషయాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకెళ్తాం’’ అని ఎమ్మెల్యే ఆది స్పష్టం చేశారు.