Alcohol Scandal in Africa: ఖండాలు దాటిన కల్తీ కథ
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:28 AM
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వరసకు సోదరులు. వారిద్దరూ మద్యం స్కాంలో అనుమానితులు. మద్యం వ్యాపారాన్ని...
ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందా
కామెరూన్‌లో ఏపీ మార్కు జే బ్రాండ్లు
ఇష్టారాజ్యంగా కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి
రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ర్టీస్ పేరిట వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి తయారీ
మద్యం తాగి అనేక మంది మృతి
ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజల ఉద్యమం
డిస్టిలరీ మూసేసిన కామెరూన్ ప్రభుత్వం
ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డీస్ ఇండస్ర్టీస్
జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ‘ఖ్యాతి’ని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని కామెరూన్‌లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ర్టీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు.
కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామెరూన్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. దేశం కాని దేశంలో జగన్ సోదరుల ఆటలు సాగలేదు. వారి కంపెనీని కామెరూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం తయారు చేస్తోందని ప్రకటించి, కంపెనీని మూసివేయించారు.
జగన్ సోదరులు మద్యం దందాను ఒక్క కామెరూన్‌తోనే సరిపెట్టలేదు. ఆఫ్రికా ఖండమంతా తమ వ్యాపారాలను విస్తరించారు. పలు దేశాల్లో మద్యం, మైనింగ్, ఇతరత్రా వ్యాపారాలు చేపట్టారు. ఇదీ.. జగన్, ఆయన సోదరుల ‘ఘనత’. కానీ చిత్రంగా ఇప్పుడు రాష్ట్రంలో నకిలీ మద్యం అంటూ ఆయన పార్టీ గగ్గోలు పెడుతోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వరసకు సోదరులు. వారిద్దరూ మద్యం స్కాంలో అనుమానితులు. మద్యం వ్యాపారాన్ని ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు విస్తరించారు. వారి కంపెనీ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ర్టీస్ ప్రమాణాలు పాటించకుండా కల్తీ మద్యం తయారుచేస్తోందని, ఆ దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని అక్కడి మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చాయి.

కల్తీ మద్యం ఉత్పత్తిని ఆపాలంటూ ప్రజలు ఉద్యమం కూడా చేపట్టారు. ఆఫ్రికాలో జగన్ సోదరులు చేసిన మద్యం దందా గురించి ఇన్నాళ్లూ ఇక్కడ పెద్దగా తెలియదు. తాజాగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలోని కామెరూన్‌లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ర్టీస్ పేరుతో మద్యం వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత మద్యంతో పాటు వివిధ వ్యాపారాలను ఆఫ్రికా అంతటా విస్తరించారు. టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, జాంబియా, మొజాంబిక్ దేశాల్లో మద్యం, మైనింగ్ ఇతరత్రా వ్యాపారాలు ప్రారంభించారు. పేద ప్రజలకు తక్కువ ధరకే మద్యం అమ్ముతున్నామంటూ అదో ప్రజాసేవలా కలరింగ్ ఇస్తూ మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాయల్ విస్కీ, రాయల్ జిన్, రాయల్ రమ్, జెడ్ జిన్ బ్రాండ్లను అక్కడ విక్రయిస్తున్నారు. ప్రమాణాలు పాటించి సీసాల తరహాలో మద్యం ఉత్పత్తి చేస్తే నిరాటంకంగా వ్యాపారం సాగేదే. కానీ అధిక ఆదాయార్జన లక్ష్యంగా షాంపూ ప్యాకెట్లు(సాచెట్) తరహాలో మద్యం అమ్మడం ప్రారంభించారు. 2013లో కామెరూన్‌లో రెడ్డీస్ గ్లోబల్ మద్యం ఉత్పత్తి ప్రారంభించగా... ఏడాది కాలంలోనే సాచెట్ ప్యాకెట్ల మద్యం తాగి ఆ దేశ ప్రజలు అనేక మంది చనిపోయారు. అయితే ఫలానా కంపెనీ అని పేరు ప్రస్తావించకుండా అన్ని కంపెనీల సాచెట్ తరహా మద్యం ఉత్పత్తిని ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది. 2016 నాటికి సాచెట్ తరహా మద్యం ఎక్కడా ఉండకూడదని స్పష్టంచేసింది. అయినా ఆదాయమే లక్ష్యంగా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ మద్యం ఉత్పత్తిని కొనసాగించింది. దీంతో 2020 తర్వాత ఈ తరహా కల్తీ మద్యం మాకొద్దంటూ ఆ దేశ ప్రజలు రోడ్డెక్కారు. పలు నగరాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా జోక్యం చేసుకుని కల్తీ మద్యం నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కామెరూన్‌లో దందాకు తెర
సాచెట్ తరహా మద్యం ఉత్పత్తి ఆపేయాలని కామెరూన్ ప్రజలు రోడ్డెక్కినా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆ దేశంలో కొందరు యువకులు ఎవరు ఎక్కువ మద్యం తాగుతారంటూ పోటీలు పెట్టుకున్నారు. సాచెట్ ప్యాకెట్ల మద్యం తాగి ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొక యువకుడు సాయంత్రం చనిపోయాడు. ఆ మద్యం తాగిన వారంతా అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటన ఆ దేశంలో వైరల్ అయ్యింది. వద్దన్నా కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటూ కామెరూన్ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమానికి దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ ప్రభుత్వం రెడ్డీస్ గ్లోబల్ కంపెనీలో తనిఖీలు చేపట్టింది. ఆ దేశ గనులు, పరిశ్రమలు, సాంకేతిక అభివృద్ధి మంత్రి ఫుహ్ కాలిస్టన్ జెంట్రీ కంపెనీని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఉత్పత్తి చేస్తున్నారని గుర్తించి వెంటనే డిస్టిలరీని మూసివేశారు. దీంతో కామెరూన్‌లో జగన్ సోదరుల మద్యం దందాకు తెరపడింది. అయితే రెడ్డీస్ కంపెనీ తనకు అనుకూలంగా మరోలా ప్రచారం చేసుకుంది. ఇది కార్పొరేట్ కంపెనీల కుట్రని, పేదలకు తక్కువ ధరకు మద్యం దొరక్కుండా చేస్తున్నాయని, ఆంధ్రా నుంచి ఆఫ్రికా వెళ్లి అక్కడి ప్రజలకు సేవ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చింది.
ఇక్కడ నకిలీపై గగ్గోలు
కమీషన్ల కోసం పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి తక్కువ ఖర్చుతో నాసిరకం మద్యం ఉత్పత్తి చేసిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదే. గత ప్రభుత్వంలో విషపూరిత మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు. జే బ్రాండ్లలో ప్రమాదకర విషపూరిత రసాయనాలు ఉన్నాయని లేబొరేటరీలు కూడా నిర్ధారించాయి. అయితే ఆ నివేదికలను గత ప్రభుత్వం అధికార బలంతో తొక్కిపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసిన మద్యంపై వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎప్పుడూ రాలేదు. కమీషన్ల రూపంలో వేల కోట్లు దోపిడీ చేశారు. నకిలీ మద్యం తయారీకి కూడా గత ప్రభుత్వంలోనే నాంది పడింది. అయితే ఇవన్నీ మరిచిపోయి కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. కూటమి ప్రభుత్వం వల్లే నకిలీ మద్యం బాగోతం జరిగిందంటూ గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం నకిలీ మద్యం దొరికిన వెంటనే అప్రమత్తమైంది. ములకలచెరువులో నకిలీ మద్యం పట్టుబడగా దాని ఆనవాళ్లు ఎక్కడున్నాయో అన్ని చోట్లా తనిఖీలు చేసి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.
కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి
రెడ్డీస్ కంపెనీ మద్యం ఉత్పత్తిలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. కల్తీ చేసిన ఆల్కహాల్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అక్రమ ఆల్కహాల్ ఉత్పత్తిలో భాగస్వామ్యమైన వ్యక్తులను గుర్తించి, శిక్షించేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేస్తాం. నిబంధనలు పాటించాలని కొంతకాలంగా ఈ కంపెనీకి సూచించాం. అయినా పాటించకపోవడంతో మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నాం.
- ఈ ఏడాది మార్చిలో తనిఖీల సందర్భంగా
కామెరూన్ మంత్రి ఫుహ్ కాలిస్టన్ జెంట్రీ