Share News

YS Sharmila: విచారణకు సిద్ధమని చెప్పే దమ్ములేదా

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:02 AM

అధికారంలో ఉండగా చేసిన స్కామ్‌లపై విచారణకు సిద్ధమని చెప్పే దమ్ములేని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరసనలు చేస్తుంటే... దొంగే... దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

YS Sharmila: విచారణకు సిద్ధమని చెప్పే దమ్ములేదా

జగన్‌ నువ్వు నిరసనలు చేస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది: షర్మిల

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉండగా చేసిన స్కామ్‌లపై విచారణకు సిద్ధమని చెప్పే దమ్ములేని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరసనలు చేస్తుంటే... దొంగే... దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. బుధవారం ఆమె ఎక్స్‌లో స్పందించారు. మద్యం అమ్మకాలను నగదు రూపంలో కొనసాగించడంపై అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధమని చెప్పే దమ్ము జగన్‌కు లేదు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ బహిరంగంగా ఎందుకు ప్రకటించడం లేదు? ఇంట్లో ప్రెస్‌మీట్లు పెట్టి మారం చేసే జగనే అసలైన వెన్నుపోటుదారుడు. కూటమి హామీలపై గళం విప్పకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా? ఉన్మాద అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది కిందట ఇదే రోజున కూటమి పార్టీలకు పట్టం కడితే... ప్రజాతీర్పునకు జగన్‌ వెన్నుపోటు అంటూ వక్రభాష్యం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం పునరిర్మాణం పేరిట సంవత్సరంపాటు కాలయాపన చేసింది. సూపర్‌సిక్స్‌ హామీలను గాలికి వదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారు. ఇవ్వాళ ప్రజా తీర్పు దినం కాదు... రాష్ట్ర ప్రజా వంచన దినం. నమ్మకం పేరిట మోదీ, బాబు, పవన్‌ రాష్ట్ర ప్రజలను వంచించారు’ అని షర్మిల అన్నారు

Updated Date - Jun 05 , 2025 | 06:03 AM