YS Sharmila: ఆదివాసీలకు అక్షర జ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:11 AM
ఆదివాసీలకు అక్షర జ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు...
ఏజెన్సీల్లోని 70 పాఠశాలల్లో ఒక్క టీచరూ లేరు : వైఎస్ షర్మిల
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆదివాసీలకు అక్షర జ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. శనివారం ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గిరిజన విద్యకు మహర్దశ, పెద్దపీట లాంటి ఆర్భాటపు మాటలకే ప్రభుత్వం పరిమితమైంది. గిరిజన సంక్షేమంపై మీరు వేసింది కత్తిపీట. మంత్రులుగా మహర్దశ మీకు కానీ... గిరిజన బిడ్డలకు కాదు. పాఠశాలలు తెరచుకుని మూడు నెలలు దాటినా... ఏజెన్సీ ప్రాంతాల్లోని బడులలో కనీసం ఒక్క ఉపాధ్యాయుడు లేడంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? విద్యాశాఖ పనిచేస్తున్నట్లా? నిద్దరపోతున్నట్లా? గిరిపుత్రుల విద్యోన్నతికి కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. వెలుగుల పేరుతో గిరిజన విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఉపాధ్యాయులు లేక, చదువులు సాగక రాష్ట్రంలో గిరిజన విద్య కుంటుపడింది. డీఎస్సీ నియామకాలు జరిగేంతవరకూ ఆదివాసీ బిడ్డలకు చదువులు దూరం చేయడం తగదు. పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 70 పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖాళీలను భర్తీ చేసేంతదాకా విద్యా వలంటీర్లను నియమించి గిరిపుత్రుల చదువులు సాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్‌ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’ అని షర్మిల పేర్కొన్నారు.