Share News

YS Sharmila: షర్మిల దీక్ష భగ్నం

ABN , Publish Date - May 22 , 2025 | 04:46 AM

విశాఖ ఉక్కు కార్మికుల తరఫున పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. కార్మికుల పునర్నియామకాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమె దీక్షను పోలీసులు రద్దు చేసి విమానాశ్రయానికి తరలించారు.

YS Sharmila: షర్మిల దీక్ష భగ్నం

తొలగించిన ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ విశాఖలో ఆమరణ దీక్ష

రాత్రి భగ్నం చేసి తరలించిన పోలీసులు

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), మే 21(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంటు పరిరక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. కర్మాగారంలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతుగా బుధవారం కూర్మన్నపాలెంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీలుప్లాంటులో తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో లాభాల్లో ఉన్న స్టీలుప్లాంటు బీజేపీ అధికారంలోకి రాగానే నష్టాల్లోకి ఎలా వెళ్లిందో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారానికి ముడి సరకు అందకుండా చేసిందన్నారు. రూ.పదకొండు వేల కోట్లు ఇచ్చి స్టీలుప్లాంటును ఆదుకున్నామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. అందులో ఎనిమిది వేల కోట్లు బ్యాంకు రుణాల కింద తీసుకున్నారని, మిగిలిన మూడు వేల కోట్లు ఇవ్వాలంటే.. ఐదు వేల మంది కార్మికులను తొలగించాలని నిబంధన పెట్టారని, ఇప్పటికే రెండు వేల మందిని తొలగించారని, మరో మూడు వేల మందికి తొలగించడానికి సిద్ధపడుతున్నారన్నారు. స్టీల్‌ప్లాంటును నిర్వీర్యం చేసి అదానీకి ఇద్దామని ప్రధాని మోదీ చూస్తున్నా, కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను తొలగిస్తుంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేంతవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సీహెచ్‌ నరసింగరావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, గంగారావు, జెర్రిపోతుల ముత్యాలు, నీరుకొండ రామచంద్రరావు, లక్కరాజు రామారావు, కేఎ్‌సఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


షర్మిలను విమానాశ్రయానికి తరలించిన పోలీసులు

షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు షర్మిలను శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా శిబిరం నుంచి బయటకు తీసుకువచ్చి, విమానాశ్రయానికి తరలించారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 04:46 AM