YS Sharmila: రాధాకృష్ణన్‌కు ఓటేసి.. వైఎస్ ఛాతీలో కత్తి దింపారు
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:12 AM
ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటేయడం ద్వారా వైఎ్‌సఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలిపోతారు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
రాజశేఖరరెడ్డి బతికుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవారు
జగన్ రాజకీయ వ్యభిచారి.. బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారు
రాజకీయాల్లోకి రాకముందే రాజారెడ్డి అంటే భయమెందుకు?: షర్మిల
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటేయడం ద్వారా వైఎ్‌సఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలిపోతారు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నా తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుంటే... కొడుకు జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారు. నా కుమారుడు రాజారెడ్డిని చంద్రబాబు రాజకీయాల్లోకి తెస్తే... ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు ఓటేశారు? చంద్రబాబు చెబితే రాజకీయాల్లోకి వచ్చానంటూ నా కుమారుడు చెప్పినట్లుగా వైసీపీ నేతలు మార్ఫింగ్ చేశారు. నా కొడుకు రాజారెడ్డిని చూస్తే భయం ఎందుకు జగన్..? నా కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ పేరు పెట్టారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా నా కుమారుడు వైఎస్ వారసుడే. వైఎస్ జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. జగన్ సుదర్శన్‌రెడ్డికి ఎందుకు మద్దతివ్వలేదు? జగన్, మోదీకి దత్తపుత్రుడు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్... అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? టీడీపీ, జనసేన... బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే... జగన్ రహస్య పొత్తు పెట్టుకున్నారు. జగన్ ఒక రాజకీయ వ్యభిచారి. కూటమి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం. సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయ్యింది’ అని వ్యాఖ్యానించారు.