Share News

YS Sharmila: వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 06:16 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ మళ్లీ దర్యాప్తు జరపాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో...

YS Sharmila: వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి

  • సీబీఐ విచారణ సజావుగా లేదన్న సునీత ఆరోపణల్లో నిజం ఉంది

  • జగన్‌ను, అవినాశ్‌రెడ్డిని కాపాడడానికి ప్రధాని మోదీ సీబీఐ గొంతు నొక్కుతున్నారు: షర్మిల

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ మళ్లీ దర్యాప్తు జరపాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో శుక్రవారం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తులో ఆయన కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగలేదు. దీనిపై సీబీఐ మళ్లీ దర్యాప్తు ఎందుకు చేయకూడదు? ప్రధాని మోదీకి జగన్‌ దత్తపుత్రుడు. మోదీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ. జగన్‌ కోసం సీబీఐ గొంతును మోదీ నొక్కుతున్నారు. జగన్‌ కోసం అవినాశ్‌రెడ్డిని కాపాడుతున్నారు. నిజంగా వివేకా హత్య కేసులో నిందితులను పట్టుకోవాలంటే నేరస్థులెవరో సీబీఐ ఎప్పుడో తేల్చేసేది. సీబీఐ వద్ద గూగుల్‌ మ్యాప్‌లు, లొకేషన్లతో సహా సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. సీబీఐ విచారణ సరిగా లేదని సునీత చేస్తున్న ఆరోపణల్లో నిజముంది’ అని షర్మిల స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే కేంద్రం ప్రకటించిందంటూ గుర్తు చేసిన షర్మిల.. నాడు ప్రధాని మోదీని జగన్‌ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. అధికారం పోయిన తరువాత నేడు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తామని ప్రకటించడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన టీడీపీ ఈ విషయంలో మౌనంగా ఉండడం ఏమిటంటూ షర్మిల నిలదీశారు.

Updated Date - Aug 30 , 2025 | 06:17 AM