బల్క్ డ్రగ్ పార్కుపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలి: షర్మిల
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:48 AM
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన చేశారు. ‘అనకాపల్లి మత్స్యకారులది ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన పోరాటం. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై పునరాలోచన చేయాలి. డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే వాయు, జల కాలుష్యం పెరుగుతుంది, క్యాన్సర్ల బారిన పడతామని, ప్రాణాలు పోతాయని మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నక్కపల్లి మత్స్యకారుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా పరిశ్రమలు పెట్టి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే ఊరుకునేదిలేదు. మత్స్యకారుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది’ అని షర్మిల ప్రకటించారు.