YS Sharmila: అధ్వానంగా సంక్షేమ వసతి గృహాలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:37 AM
రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సి వస్తోంది అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు
బాబుకు గుడులపై ఉన్న శ్రద్ధ... బడులు, హాస్టళ్లపై లేదు: వైఎస్ షర్మిల
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం విద్యార్థినులకు పరామర్శ
విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సి వస్తోంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పచ్చకామెర్ల బారినపడి నగరంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల బాలికల వసతి గృహం విద్యార్థినులను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నెలకొన్న దారుణ పరిస్థితులను గుర్తించిన హైకోర్టు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా సంక్షేమ వసతి గృహాల్లో వసతులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. కలుషిత నీరు తాగడం వల్లే చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందడం బాధాకరం. వసతి గృహాల్లో భోజనం బాగుండడం లేదని చిన్నారులు చెప్పారు. ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 228 మంది ఆడ పిల్లలుండే హాస్టల్‌లో ఒకే బాత్‌రూమ్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రూమ్‌లో 17మంది ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు గుడులు మీద ఉన్న శ్రద్ధ బడులు, హాస్టళ్ల మీద లేదు. దీన్ని ప్రశ్నిస్తే నేను హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చిత్రీకరించారు. స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 పేరుతో వచ్చే రెండేళ్లలో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. కురుపాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు