YS Sharmila: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:43 AM
పనికిరాని ప్రాజెక్టుకు డీపీఆర్‌ల మీద, నిధుల సమీకరణ మీద పెట్టే దృష్టి పెండింగ్‌లో ఉన్న 56 ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం...
లింక్ ప్రాజెక్టులతో ఉపయోగం లేదంటున్నా డీపీఆర్‌ల పేరుతో హడావిడి అవినీతికి స్కెచ్: షర్మిల
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘పనికిరాని ప్రాజెక్టుకు డీపీఆర్‌ల మీద, నిధుల సమీకరణ మీద పెట్టే దృష్టి పెండింగ్‌లో ఉన్న 56 ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన చేశారు. ‘నిన్న బనకచర్ల, నేడు నల్లమల సాగర్. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా... చంద్రబాబు ఆశమాత్రం చావలేదు. అనుసంధానంపై ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడంపై లేదు. పెండింగ్ ప్రాజెక్టులను గాలికి వదిలేసి లింక్ ప్రాజెక్టును పట్టుకుని తిరుగుతున్నారు. పోలవరంతో సహా 56 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు లేవుకానీ... రూ.58 వేల కోట్లతో పోలవరం - నల్లమల సాగర్ లింక్ కడతారంట. ఇది భారీ అవినీతికి స్కెచ్ కాకపోతే మరేంటి? లింక్ ప్రాజెక్టుతో ఉపయోగం లేదని జల వనరుల నిపుణులు మొత్తుకుంటున్నా డీపీఆర్‌ల పేరిట హడావిడి ఎందుకు?’ అని షర్మిల ప్రశ్నించారు.