Share News

Farmers Issues: షర్మిల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:22 AM

రైతుల సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Farmers Issues: షర్మిల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

  • రైతుల సమస్యలపై సీఎంను కలుస్తానన్న కాంగ్రెస్‌ ఏపీ చీఫ్‌

  • బెజవాడ నుంచి ట్రాక్టర్‌పై ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం

విజయవాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులతో కలిసి విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ నుంచి అసెంబ్లీకి ట్రాక్టర్‌పై బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల సహా పార్టీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాల సందర్భం గా సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తానని షర్మిల ఇటీవల మీడియాకు చెప్పారు. ఈ క్రమంలో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. శుక్రవారం ఉల్లిపాయల దండ మెడలో వేసుకుని అసెంబ్లీకి బయలుదేరారు. పంటలకు మద్దతు ధర లభించటం లేదని, ‘ఈ -క్రాప్‌’ సరిగా నమోదు కావడం లేదని, రైతులకు యూరియా కూడా అందడం లేదని, ఉల్లి రైతులను పట్టించుకోవటం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ట్రాక్టర్‌ ఎక్కి అమరావతికి బయలు దేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఆంధ్రరత్నభవన్‌కు చేరుకుని షర్మిల సహా నాయకులను అడ్డుకున్నారు. రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి న షర్మిల.. ట్రాక్టర్‌పైనే నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. పోలీసులు అనుమతులు లేవని చె ప్పే ప్రయత్నం చేయగా.. ఆమె వారి మాటను పట్టించుకోలేదు. ర్యాలీకి అనుమతి ఇచ్చే వరకు ఆం దోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఇటు కాంగ్రెస్‌ నాయకులు, అటు పోలీసుల హడావుడితో ఆంధ్రరత్నభవన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


రైతులకు అన్యాయం

ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని నడిరోడ్డు మీద వదిలేసి.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని షర్మిల మండిపడ్డారు. పోలీసులు అడ్డుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తేశారని షర్మిల ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. రైతులు సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేశారని విమర్శించారు. ‘‘టమాటా ధర రెండు రూపాయలా?. క్వింటా ఉల్లిపాయలకు రూ.50 ఇస్తారా?.’’ అని ప్రశ్నించారు. మిర్చికి రూ.12 వేలు ఇస్తామని రూ.6 వేలు కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను చంద్రబాబుకు విన్నవించాలని భావించినట్టు చెప్పారు. పోలీసులు తనను అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్‌ నిలబడిందని, కానీ, పోలీసులతో తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 27 , 2025 | 05:23 AM