YS Sharmila: అప్పు తీసుకొని రాజధాని నిర్మాణమా..
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:43 AM
చంద్రబాబుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలబడి ఉంది అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం రాజధాని గ్రామం ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఆమె సందర్శించారు.
అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే
2వ విడత పూలింగ్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం: షర్మిల
రాజధాని అమరావతిలో పర్యటన
తుళ్లూరు, అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): చంద్రబాబుతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలబడి ఉంది అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం రాజధాని గ్రామం ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఆమె సందర్శించారు. 16 వేల గ్రామాల నుంచి తెచ్చిన నీరు, మట్టిని పరిశీలించారు. శిలాఫలకం వద్ద కర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి 2015లో శంకుస్థాపన చేసిన మోదీ అభివృద్ధికి సహకరించలేదని మండిపడ్డారు. శంకుస్థాన ప్రదేశంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. ‘ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం జరుగుతుందని ఉత్తుత్తి కబుర్లు చెప్పి మోదీ... మట్టి, నీరు ఇచ్చి వెళ్లారు.
మొన్న రాజధాని పునఃప్రారంభ పనులు కూడా ఇదే బాపతు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని రాజధాని కట్టటమేంటి? రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కాలర్ పట్టుకొని అడగకుండా... చంద్రబాబు ఎందుకు అప్పులు తీసుకుంటున్నాడు? అమరావతి నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే. రెండవ విడత పూలింగ్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. రైతుల తరఫున పోరాటం చేస్తాం. రియల్ ఎస్టేట్ కోసమే రెండవ విడత భూ సమీకరణ. అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉంది. రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనే వెలుగు లేదు (కరెంట్). మరి అభివృద్ధి ఎలా చేస్తారు? అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? జగన్‌రెడ్డి మూడు రాజధానుల పాట పాడి ఒకటికి కూడా తికానా లేకుండా చేశాడు. అమరావతిలో భూమాఫియ నడుస్తోంది’ అని షర్మిల ప్రశ్నించారు.