YS Sharmila: రాజకీయాల్లోకి రాజారెడ్డి
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:11 AM
అవసరమైనప్పుడు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. సోమవారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకొని...
అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు: షర్మిల
కర్నూలులో ఉల్లి రైతులకు పరామర్శ
తల్లి వెంట వచ్చిన తనయుడు
అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం
కర్నూలు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అవసరమైనప్పుడు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. సోమవారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకొని, వారిని పరామర్శించేందుకు కుమారుడితో కలసి వచ్చారు. రాజారెడ్డి కూడా మెడలో కండువా వేసుకుని పర్యటన ముగిసే వరకూ తల్లి షర్మిల వెంటే ఉన్నారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వస్తారని షర్మిల అన్నప్పుడు ఆయన మొహంలో చిరునవ్వు కనిపించింది. రైతుల సమక్షంలోనే కుమారుడి రాజకీయ పరిచయం చేయాలనే వ్యూహంలో భాగంగానే కర్నూలు మార్కెట్‌ను వేదికగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు బయల్దేరే ముందు రాజారెడ్డి తమ ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ కార్యక్రమాల్లో మినహా రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. తొలిసారిగా కర్నూలు మార్కెట్ యార్డులో తల్లి షర్మిలతో కలసి రైతులను పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపించింది.
అమెరికా వెళ్లి తిరిగొచ్చాక!
వైఎస్ షర్మిల, అనిల్‌కుమార్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి 1996లో జన్మించారు. హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం అక్కడే సొంతంగా వ్యాపారాలు చూసుకుంటున్నారు. రాజారెడ్డి రెండు వారాల్లో అమెరికాకు వెళ్తారు. అక్కడ వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకుని రాష్ట్రానికి తిరిగొస్తారు. అనంతరం రాజారెడ్డితో కలసి వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం అవుతారని సమాచారం.
ఉల్లి రైతులను ఆదుకోవాలి: షర్మిల
ఉల్లి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ధరలు పతనమై పెట్టుబడిలో సగం కూడా రావడం లేదని షర్మిల అన్నారు. క్వింటాకు రూ.2,500 గిట్టుబాటు ధర చెల్లించి ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట దిగుబడులతో కర్నూలు మార్కెట్‌కు వచ్చిన ఉల్లి రైతులతో ఆమె మాట్లాడారు. ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అరకొర దిగుబడి మార్కెట్‌కు తెస్తే క్వింటా రూ.250-600కు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చి ఉల్లి ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, ఎందుకు ఎగుమతి చేయలేకపోతున్నారని షర్మిల ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడే ఆమరణదీక్ష చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్, మూలింటి మారెప్ప తదితరులు పాల్గొన్నారు.