Share News

Chairman Moshen Raju: వైఎస్‌ పేరెత్తారని వాకౌట్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:04 AM

శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు విచిత్రంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో అధికార పక్ష సభ్యులు దివంగత వైఎస్‌ పేరెత్తగానే వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.

Chairman Moshen Raju: వైఎస్‌ పేరెత్తారని వాకౌట్‌

  • మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుల విచిత్ర వైఖరి

  • దుర్గగుడి అధికారులు ఫోన్లు ఎత్తట్లేదు

  • చైర్మన్‌ మోషేన్‌ రాజు అసహనం

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు విచిత్రంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో అధికార పక్ష సభ్యులు దివంగత వైఎస్‌ పేరెత్తగానే వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్‌ చేశారు. తొలుత ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో ‘సూపర్‌ సిక్స్‌’లో ప్రకటించిన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై చర్చకు పట్టుబట్టారు. కానీ, చైర్మన్‌ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అనంతరం, కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీజ్‌ చేయించిన షిప్‌ ఏమైందని, ప్రభుత్వం పెట్టిన కేసులు ఏమయ్యాయని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న టీడీపీ సభ్యుల ప్రశ్నపై మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి సమాధానం చెబుతున్న సమయంలో.. కడపలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. గత పాలకులు ప్రభుత్వ ధనంతో బహిరంగ ప్రదేశాల్లో వైఎస్సార్‌ విగ్రహాలు పెట్టారని అన్నారు. దీంతో ‘వైఎస్సార్‌’ పేరు ప్రస్తావించడాన్ని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీనికి నిరసనగా ప్రశ్నోత్తరాలను వాకౌట్‌ చేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. దీనికిముందు.. 2024, జూన్‌ నుంచి ప్రైవేట్‌ సంస్థలకు భూ కేటాయింపులు, ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో.. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టుల భర్తీ చేసినట్లు ఉండటంతో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీచర్‌ పోస్టుల భర్తీని పారిశ్రామిక సంస్థల ఏర్పాటుతో ఎలా చూపుతారని ప్రశ్నించారు. దీనిపై సమాధాన పత్రాల్లో పొరపాటున మరొకటి వచ్చిందని మంత్రి అన్నారు.


పరిశ్రమలకు ప్రోత్సాహం: భరత్‌

రాష్ట్రంలో 2024, జూన్‌ నుంచి ప్రైవేట్‌ కంపెనీలకు ఏపీఐఐసీ 6,022 ఎకరాలు కేటాయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఇప్పటి వరకు 3.48 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఏపీ పారిశ్రామిక విధానం 4.0, ఎంఎ్‌సఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెలవ్‌పమెంట్‌ పాలసీ 4.0, ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు తెచ్చినట్లు చెప్పారు. సుస్థిర పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

విగ్రహాలకు అనుమతి లేదు: జనార్దన్‌రెడ్డి

బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో 2,524 అనధికార విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. పులివెందుల, కడపలో కూడళ్ల సుందరీకరణకు రూ.10.71 కోట్లుమంజూరు చేశామన్నారు.

ఆ బియ్య వేలం వేస్తున్నాం: నాదెండ్ల

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. 2024, జూన్‌ నుంచి గత ఆగస్టు వరకు బియ్యం అక్రమ రవాణాపై 2,438 కేసులు పెట్టామని, 282 వాహనాలు సీజ్‌ చేశామని తెలిపారు. 5.65 లక్షల క్వింటాళ్ల బియం స్వాధీనం చేసుకుని వే లం వేయగా రూ.6.60 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రేషన్‌ మాఫియా బలంగా పాతుకుపోయిందని, కేసులు పెడితే కోర్టుకు వెళ్తున్నారని తెలిపారు.


పర్యాటకంలో పెట్టుబడులు: దుర్గేష్‌

పర్యాటక ప్రాజెక్టులపై మంత్రి కందుల దుర్గేష్‌ సమాధానమిస్తూ.. 15 నెలల్లో రూ. 10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 103 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. రూ.3,887కోట్లతో 15 ప్రాజెక్టులకు అడుగులు పడ్డాయని తెలిపారు. 100 పుణ్యక్షేత్రాల్లో టెంట్‌ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 2024-29 మధ్య టూరిజం ప్రాజెక్టుల గురించి అడిగితే మీ పాలనలోవి చెబుతున్నార ని అన్నారు. దీంతో 2019-24 మధ్య టూరిజానికి సంబంధించి రూ.21,941 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినా.. 20ు కూడా అమలు కాలేదని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో కట్టినవాటిల్లో రుషికొండ ప్యాలెస్‌ ఒకటని, దీని కరెంటు బిల్లు బకాయి పెట్టిపోయారన్నారు.

దుర్గమ్మ దర్శనం దక్కట్లేదు: చైర్మన్‌

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడికి వెళ్తున్న ఎమ్మెల్సీలకు దర్శనం చేయించడానికి ఎవరూ స్పందించడం లేదని మం డలి చైర్మన్‌ మోషేన్‌ రాజు అసహనం వ్యక్తం చేశారు. దర్శనం కోసం వెళ్లిన ఎమ్మెల్సీలు 10 సార్లు ఫోన్‌ చేసినా.. అధికారులు ఫోన్లు ఎత్త డం లేదన్నారు. దీనిపై మంత్రి మనోహర్‌ జోక్యం చేసుకుని, ప్రొటోకాల్‌ ప్రకారం సభ్యులకు ఉదయం 7-9 గంటల మధ్య వీఐపీ దర్శనం చేయిస్తామని తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 06:07 AM