Share News

CBI Special Court: అక్రమాస్తుల కేసులో.. 21న కోర్టుకు జగన్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:29 AM

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ నెల 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు.

CBI Special Court: అక్రమాస్తుల కేసులో.. 21న కోర్టుకు జగన్‌

  • హాజరు మినహాయింపును తీవ్రంగా వ్యతిరేకించిన సీబీఐ

  • కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కౌంటర్‌

  • దీంతో జగన్‌ మెమో ఉపసంహరణ

  • హాజరుకు 21వరకు గడువిచ్చిన కోర్టు

  • ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్న వైనం

  • 12 ఏళ్లుగా బెయిల్‌పైనే జగన్‌

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ నెల 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సీబీఐ మంగళవారం కౌంటర్‌ దాఖలు చేసింది. యూరప్‌ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గట్టిగా కోరింది. తీవ్ర ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్న జగన్‌.. ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో గత్యంతరం లేక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా.. అదే రోజున న్యాయస్థానానికి జగన్‌ వస్తారని న్యాయవాది వెల్లడించారు. దీంతో ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు. జగన్‌ అభ్యర్థనతో గత నెలలో ఆయన యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే. తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది.


అందుకు అంగీకరించి యూరప్‌ వెళ్లిన మాజీ సీఎం.. స్వదేశానికి వచ్చాక మాత్రం పిల్లిమొగ్గలు వేశారు. రకరకాల కారణాలు చెబుతూ.. హాజరు నుంచి మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతుందని, ఆన్‌లైన్‌లో విచారణకు హాజరవుతానని కోర్టును కోరారు. సీబీఐ అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ 2012 మే 27న జగన్‌ను అరెస్టు చేసింది. సుమారు 16 నెలలు ఆయన జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబరు 23న ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. 24వ తేదీన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుల్లో పన్నెండేళ్లుగా జగన్‌ బెయిల్‌పైనే ఉన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 05:32 AM