YS Jagan: ఆ ముగ్గురినీ బొక్కలో పెట్టాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:22 AM
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను అరెస్టు చేసి..
చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై జగన్ ధ్వజం
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను అరెస్టు చేసి బొక్కలో పెట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ముఖ్యమంత్రిని చేసినందుకు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సానుకూల మీడియాను ముందు కూర్చోబెట్టుకుని జగన్ దాదాపు 2.43 గంటల సేపు ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, రాణ్యానికి (నాణేనికి) ఇటు వైపు ఏముందో బహిర్గతం చేస్తున్నానని అన్నారు. కలుషిత తాగునీటితో వసతి గృహాల్లో పిల్లలు చనిపోతున్నారని ఆరోపించారు. కొత్త మెడికల్ కాలేజీలను 8 మంది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కోటి సంతకాల ఉద్యమం జరుగుతోందని, ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తవుతుందని, ఆ రోజున నియోజకవర్గాల్లో ఈ పత్రాలు బయలుదేరి 13వ తేదీ నాటికి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి చేరుతాయని వెల్లడించారు. వాటిని 16వ తేదీన గవర్నర్‌కు అందజేస్తామని, ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే రీతిలో చంద్రబాబు పాలన సాగుతోందని, రైతుల పరిస్థితిని చూస్తే జాలేస్తోందని అన్నారు. అందరూ హలో ఇండియా సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినదిస్తున్నారని అన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆదుకోలేదని విమర్శించారు. తమ హయాంలో వ్యవసాయం పండగైతే .. కూటమి పాలనలో వ్యవసాయం దండగలా మారిపోయిందని అన్నారు.
రైతులకు ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో పంట నష్టపరిహారం అందడం లేదని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 17 సార్లు తుఫాన్లు వచ్చి పంట నష్టం జరిగిందన్నారు. రైతుల ముందుకెళితే చంద్రబాబును తంతారని, అందుకే వెళ్లలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభు త్వం వచ్చాక రైతులకు పైసా సాయం కూడా అందలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సీడీ ఎప్పుడిస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి పంటలు వేస్తున్న రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. గతేడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదని అన్నారు. మొంథా తుఫానుకు తడిసిన ధాన్యం కొనేనాథుడే కనిపించడం లేదన్నారు. ధాన్యానికి రూ.1300 ధర కడుతున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ ప్రభుత్వం ఎలా స్పందించేదో ఒకసారి గుర్తు చేసుకోవాలని రైతులను కోరారు. యుద్ధ ప్రాతిపదికన సహాయం చేసేవారిమని జగన్ అన్నారు.
అమాయకులపై కేసులు
రైతన్న కోసం అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు కానీ చంద్రబాబు రైతుల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు. అడ్వర్‌టైజ్‌మెంట్లతో బుల్‌డోజ్ చేస్తూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్‌కు ఆయన మాస్టర్ అని అన్నారు. తిరుమల లడ్డూలో పశువుల అవశేషాలున్నాయని ఎవరు చెప్పారు? లడ్డూలో అవి కలిశాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని, జైల్లో పెట్టి తన్నాలని వ్యాఖ్యానించారు. ఆయన బెయిల్ షరతులన్నీ ఉల్లంఘిస్తున్నారని, అధికారులను భయపెట్టి కేసులు కొట్టేయించుకుంటున్నారని ఆరోపించారు. అమాయకులైన జోగి రమేశ్, పిన్నెల్లి సోదరులు, వల్లభనేని వంశీ, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పను తప్పుడు కేసుల్లో ఇరికించారని విమర్శించారు. అమాయకుడైన వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని గంజాయి కేసులో ఇరికించారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని ఖూనీ చేశారని, నాడు-నేడు విద్యావ్యవస్థ కనిపించడం లేదని, ఇంగ్లిషు విద్య అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదని, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు నెలకు రూ.1500 ఇస్తానని ఎగవేశారని, పంట నష్టాన్ని చెల్లించడం లేదని, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయని ఆరోపించారు. పులివెందులలో అరటి పంటను ధర వచ్చేంత వరకు నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తే, దానిని వినియోగించకుండా రైతులకు నష్టం చేకూర్చారని అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు.