Share News

Credit Theft: పేదల ఇళ్లు.. జగన్‌ సొల్లు

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:27 AM

రాష్ట్రంలో మూడు లక్షల గృహ ప్రవేశాల ఘనతంతా తనదేనని, తనకు రావాల్సిన గొప్పతనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చోరీ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Credit Theft: పేదల ఇళ్లు.. జగన్‌ సొల్లు

  • 95 శాతంఇళ్లు పునాది, వివిధ దశల్లోనే..

  • 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు నిర్మించిన కూటమి

  • సీఎం సమక్షంలో సామూహిక గృహ ప్రవేశాలు

  • ఆ ఘనత తనదే అంటున్న జగన్‌పై సర్వత్రా విమర్శల వెల్లువ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో మూడు లక్షల గృహ ప్రవేశాల ఘనతంతా తనదేనని, తనకు రావాల్సిన గొప్పతనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చోరీ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ‘ఎక్స్‌’ వేదికగా చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌ హయాంలోనే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే.. ఆయనే గృహ ప్రవేశాలు ఎందుకు చేయించలేకపోయారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం’ అంటూ గత ఐదేళ్లూ ఊదరగొట్టిన జగన్‌ తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి అందులో 5 శాతం ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయించగలిగారు. నిరుపేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి.. జగనన్న కాలనీల పేరుతో ఏకంగా ఊళ్లే నిర్మిస్తామంటూ వేల కోట్ల ప్రజాఽఽధనాన్ని ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా లే-అవుట్లు వేశారు. అవి ఎక్కువగా ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంగా.. నివాసయోగ్యంకాని లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో చిన్నపాటి వర్షం కురిసినా ఆ లే-అవుట్లు చెరువులుగా మారుతున్నాయి. దీంతో ఆ లే-అవుట్లలో ఇళ్లు నిర్మించుకోడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ‘మీ ఇళ్లకో దండం’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన సెంటు పట్టాలను తిరిగిచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆ లే-అవుట్లన్నీ ఎందుకూ కొరగాకుండా మిగిలిపోయాయి. పేదల ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా నాటి జగన్‌ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది.


అదనపు సాయంతో గృహనిర్మాణానికి ఊపు

పేదలకు 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిన నాటి జగన్‌ ప్రభుత్వం కనీసం 5 శాతం కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడంతో.. వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ రాష్ట్రవ్యాప్తంగాఆ నిర్మాణాలను పరుగులు పెట్టిస్తోంది. మరో అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని అదనపు సాయాన్ని కూడా అందజేస్తున్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ. 50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.202 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ అదనపు సాయంతో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతోంది. దీంతో గత ప్రభుత్వంలో వివిధ దశల్లో నిలిచిపోయిన తమ ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. ఫలితంగా పేదల గృహ నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే మూడు లక్షల ఇళ్లు పూర్తిచేసి, సామూహిక గృహ ప్రవేశాలూ చేపట్టడాన్ని జీర్ణించుకోలేక ‘ఎక్స్‌’ వేదికగా అక్కసు వెళ్లగక్కిన జగన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


జగన్‌ దిగిపోయే నాటికి ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఇదీ..

జగన్‌ హయాంలో తొలివిడతగా 2020లో చేపట్టిన 15.6 లక్షల ఇళ్లలో 60,783 ఇళ్లు (5 శాతం) మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగిలిన 8 లక్షలకుపైగా ఇళ్లు పునాది దశకు కూడా చేరలేదు. మరో 2 లక్షలకు పైగా ఇళ్లు పునాది దశలో ఆగిపోయాయి. ఇంకో 58 వేల ఇళ్లు గోడల వరకు(రూఫ్‌ లెవెల్‌) పూర్తికాగా.. మరో 3 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కసరత్తు చేస్తున్నారు. అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గడచిన 17 నెలల కాలంలో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 3 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన గృహనిర్మాణ సంస్థ అధికారులు బుధవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్న జగన్‌... కూటమి ప్రభుత్వ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంపై లబ్ధిదారులు నవ్వుకుంటున్నారు.


గృహ ప్రవేశాల క్రెడిట్‌ అంతా నాదే!

కూటమి పాలనలో ఒక్క లబ్ధిదారునికీ స్థలం ఇవ్వలేదు: జగన్‌

3 లక్షల గృహప్రవేశాలపై ‘ఎక్స్‌’ వేదికగా అక్కసు

చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని విమర్శ

రాష్ట్రంలో మూడు లక్షల గృహ ప్రవేశాల ఘనతంతా తనదేనని, తనకు దక్కాల్సిన ఆ క్రెడిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు చోరీ చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లబ్ధిదారులతో కలసి 3,00,092 గృహ ప్రవేశాలను చేశారు. దీనిపై జగన్‌ గురువారం ‘ఎక్స్‌’ వేదికగా అక్కసు వెళ్లగక్కారు. ‘చంద్రబాబుగారూ.. మీ కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా సాగిస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీమ్‌ చాలా బాగుంది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఒక్క లబ్ధిదారునికి కూడా ఇంటి స్థలం ఇవ్వని చంద్రబాబు మూడు లక్షల గృహాలు నిర్మించేశారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 14 , 2025 | 06:28 AM