YS Jagan: ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:11 AM
శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించండి
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని... దానిని రద్దు చేయాలని కూడా కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12-బికి విరుద్ధమని ప్రకటించాలని కోరారు. ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. నిజానికి... తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జూలైలో జగన్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ రూలింగ్‌ను రద్దు చేసి, తనను ప్రతిపక్షనేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశారు. ‘‘నాది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్‌లో పేర్కొన్నారు. అందులోని భాషను పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షమనే మూలసూత్రాన్ని స్పీకర్ విస్మరించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 12-బిలో ప్రతిపక్ష నేతను నిర్వచించారు. దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు నేను అర్హుడిని’’ అని అన్నారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది.