SIT Raids: లిక్కర్ స్కామ్‌లో జగన్ సోదరుడు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:50 AM
పులివెందులలో జన్మించి, చెన్నైలో నివసిస్తూ, ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సోదరుడే కాదు అంతకుమించి నమ్మకమైన ఆప్తుడు కూడా.
వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్లు, సంస్థల్లో సిట్ సోదాలు
చెన్నై, హైదరాబాద్‌లో ఏకకాలంలో తనిఖీలు
చెన్నైలో 7 కంపెనీలు, 2 నివాసాలు, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మరో సంస్థ
కీలక డాక్యుమెంట్లు, ఆధారాలు స్వాధీనం
అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు, వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు
రెండు కంపెనీల్లో 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్న జగన్ భార్య భారతి రెడ్డి
ఆఫ్రికాలో మద్యం, మైనింగ్ వ్యాపారాల్లో జగన్‌కు అనిల్ బినామీగా ప్రచారం
స్వయాన పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు
జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం. ఇప్పటిదాకా జగన్ పీఎస్, మాజీ ఓఎ్‌సడీ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, గత ప్రభుత్వంలోని ఐటీ సలహాదారును సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ రక్త సంబంధీకుడు, పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సిట్ విచారణలో తేలింది. శుక్రవారం హైదరాబాద్, చెన్నైలోని అనిల్ రెడ్డికి చెందిన 8 కంపెనీలు, 2 నివాసాల్లో సిట్ సోదాలు చేసింది.
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పులివెందులలో జన్మించి, చెన్నైలో నివసిస్తూ, ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సోదరుడే కాదు అంతకుమించి నమ్మకమైన ఆప్తుడు కూడా. అన్న జగన్ తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మొదలుకొని ఇసుక, లిక్కర్ స్కామ్‌ల్లో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్‌లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి(ఏ-33 బాలాజీ గోవిందప్పదీ ఇదే మండలం) చెందిన దేవరాజులు లిక్కర్ కేసులో నిందితులైన మిథున్ రెడ్డి(ఏ-4), విజయ సాయిరెడ్డి(ఏ-5), కృష్ణమోహన్ రెడ్డి(ఏ-32), ధనుంజయ్ రెడ్డి(ఏ-31), బాలాజీ గోవిందప్ప(ఏ-33)తో తరచూ జరిపిన సంప్రదింపుల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి.
దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏకకాలంలో చెన్నై, హైదరాబాద్‌లోని అనిల్ రెడ్డి 8 వ్యాపార సంస్థలు, 2 ఇళ్లలో మొత్తం 10 చోట్ల సిట్ బృందాలు సోదాలు చేపట్టాయి. సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్ (4), టీ-నగర్ (1), పెరుంగుడి (1), అరక్కు కొట్టై (1) ప్రాంతాల్లోని అనిల్ రెడ్డికి చెందిన 7 కంపెనీలతో పాటు చెన్నైలోని ఆళ్వార్‌పేట, ఇజంబాకంలోని ఆయన నివాసాలపైనా సిట్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఆయన వ్యాపార సంస్థలోనూ సోదాలు చేపట్టారు.
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
అనిల్ రెడ్డికి చెందిన మొత్తం ఎనిమిది కంపెనీలు షిలోహ్ ఇన్‌ఫ్రా, ఖ్వన్నా ఎగ్జిమ్, షిలోహ్ ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్, ఇండో రాక్స్, వర్క్ ఈజీ స్పేస్, శ్రీ గోవిందరాజ మిల్స్, ట్రాన్సెల్ బయోలాజిక్స్‌లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నైలోని రెండు నివాసాల్లో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలు, సర్వే నివేదికలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
జగన్‌కు బినామీ: చెన్నైలో ఉండే అనిల్ రెడ్డి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో ఇసుక దోపిడీతో వెలుగులోకి వచ్చారు. జేసీకేసీ అనే సంస్థ ద్వారా రాష్ట్రంలోని సంపదను చెన్నై, బెంగళూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకూ మద్యం వ్యాపారుల నుంచి తీసుకున్న ముడుపులను వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారన్న ఆరోపణలు కూడా అనిల్ రెడ్డిపై ఉన్నాయి. అనిల్ రెడ్డి ఆఫ్రికాలో చేసే మద్యం, మైనింగ్ వ్యాపారాల్లో జగన్‌కు బినామీ అని వైసీపీలో చెబుతుంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి జైలుకు వెళ్లి మధ్యంతర ఎన్నిక అనివార్యమైతే కడప పార్లమెంటు స్థానం నుంచి అనిల్ రెడ్డిని వైసీపీ తరఫున బరిలో దించేందుకు జగన్ సిద్ధమైనట్లు అప్పట్లో వైసీపీలో బలంగా ప్రచారం జరిగింది. 2012లో అక్రమాస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్డులో దిల్ కుషా గెస్ట్ హౌస్ ముందు అర్ధరాత్రి వరకూ విజయమ్మ, షర్మిల, భారతితో పాటు అనిల్ రెడ్డి భార్య రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
2020 వరకు భారతి డైరెక్టర్
లిక్కర్ ముడుపులను అనిల్‌కు చెందిన 8 కంపెనీల ద్వారా విదేశీలకు తరలించడంతో పాటు వైసీపీ ఎన్నికల ఖర్చుకు వాడుకున్నట్టు సిట్ తనిఖీల్లో వెల్లడైంది. ఎన్నికల సర్వే ఖర్చుతో పాటు అభ్యర్థులకు పంపిణీ చేసినట్టు సమాచారం. సిట్ సోదాలు చేసిన అనిల్ 8 కంపెనీల్లో 2 కంపెనీలు షిలోహ్ ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్‌లలో 2020 వరకు వైసీపీ అధినేత జగన్ భార్య భారతి డైరెక్టర్‌గా ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత ఆమె వైదొలిగారు.